బాలీవుడ్ ప్రాజెక్టులో..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతుప్రభు ప్రముఖ దర్శక -నిర్మాత రాజ్ నిడిమోరును గత డిసెంబర్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, పెళ్లి తర్వాత కూడా సమంత తన నటనకు, కెరీర్‌కు ఏమాత్రం ఆటంకం లేకుండా తన ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం బీటౌన్‌లో వినవస్తున్న తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ ప్రధాన పాత్రలో రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వంలో ఓ భారీ సూపర్ హీరో సినిమా రూపొందనుంది.
ఈ ప్రాజెక్టును గ్లోబల్ స్థాయిలో నిర్మించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సల్మాన్‌ఖాన్ కెరీర్‌లో ఇదొక విభిన్నమైన, కొత్త తరహా పాత్ర కానుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సమంత పేరును చిత్రబృందం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం హీరోయిన్ పాత్ర కోసం నయనతారను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. స్క్రిప్ట్ పనులతో పాటు ఇతర ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, ఈ సినిమాను ఆగస్టు లేదా ఆ తర్వాత సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథ, టైటిల్, ఇతర కీలక నటీనటుల వివరాలను చిత్ర బృందం గోప్యంగా ఉంచింది. ఏది ఏమైనా, రాజ్-డీకే దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్, సమంత వంటి క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను అందుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.




