28 July, 2026 | 4:06 PM

జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి బదిలీ

25-06-2024 05:01 AM
  • కొత్త ఎండీగా అశోక్ రెడ్డి నియామకం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్ జలమండలి ఎండీగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారి సీ సుదర్శన్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, సేవలు మానవ వనరుల కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి  కే అశోక్ రెడ్డిని నియమించారు. అశోక్‌రెడ్డి ప్రస్తుతం ఉద్యానవన శాఖ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.  

ఎన్నో సవాళ్లు..

జలమండలి నూతన ఎండీ అశోక్ రెడ్డి ముందు పలు సవాళ్లున్నాయి. నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కొత్త ఎండీ ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రజలు, జలమండలి ఉద్యోగులు  ఎదురుచూస్తున్నారు. జలమండలి అందిస్తున్న సేవలు ఓఆర్‌ఆర్ వరకు విస్తరించాయి. ఈ పరిధిలో 14 మండలాలు, పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే ఓఆర్‌ఆర్ పరిధిలోని గ్రామాలు, కాలనీల ప్రజల తాగునీటి అవసరాల కోసం జలమండలి ఓఆర్‌ఆర్ ఫేస్  2 పనులను నిర్వహిస్తోంది.   

ఈ పనులను 2022 జనవరి 24న అప్పటి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 2023 డిసెంబర్ నాటికి పనులు అయిపోవాల్సి ఉన్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదు.  జలమండలి ఆదాయం ప్రస్తుతం రూ.120 కోట్లు ఉంది. దానిలోని 70 శాతం నిధులు ఉద్యోగుల వేతనాలకే ఖర్చవుతున్నాయి. దీంతో జలమండలి చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోంది. కాబట్టి సొంతంగా ఆదాయం సమీకరించుకోవడానికి, స్వతంత్ర ఆర్థిక శక్తిగా ఎదగడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇవేకాకుండా నగరంలోని అక్రమ నల్లా కనెక్షన్లు, మురుగు నీటి సమస్య తదితర సవాళ్లు ఉన్నాయి. 

పని చేసింది స్వల్పకాలమే అయినా..

ఇప్పటి వరకు ఎండీగా పని చేసిన సుదర్శన్ రెడ్డి 2023 డిసెంబర్ 18న బాధ్యతలు చేపట్టారు. పనిచేసిన స్వల్పకాలం (ఆరు నెలలు) లోనే బదిలీ అయ్యారు. వేసవి సందర్భంగా రికార్డు స్థాయిలో ప్రతి రోజు వాటర్ ట్యాంకర్ల బుకింగ్స్ 6 వేల వరకు వచ్చాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకల వల్ల ఇబ్బందులు తలెత్తడాన్ని గమనించి విజిలెన్స్, జలమండలి అధికారులతో పర్యవేక్షించి మూడు నెలల్లో 6 లక్షల వాటర్ ట్యాంకర్లను సప్లు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన జలమండలి వర్షాకాల ప్రణాళికలో పలు కొత్త పద్ధతులను అనుసరించేలా చర్యలు తీసుకున్నారు. తక్కువ వర్షాపాతం నమోదవుతున్న నేపథ్యంలో గ్రేటర్‌లో ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాల ఎమర్జెన్సీ పంపింగ్‌ను ప్రారంభించారు.