కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో.. కమిషన్ నోటీసులు జారీ షురూ!

10-05-2024 01:28:18 AM

ఇద్దరు ఈఎన్‌సీలతో ప్రత్యేకంగా భేటీ అయిన  జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్

ప్రభుత్వానికి చేరినఎన్‌డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక

పలువురు అధికారుల నియామకం

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. రెండో విడతలో విచారణకు వచ్చిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అసలు సిసలైన విచారణను మొదలు పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగానే విచారణకు హాజరు కావాలని పలువురికి నోటీసులు జారీ చేయడం మొదలు పెట్టినట్టు విశ్వసనీయంగా అందిన సమాచారం. నోటీసులు జారీచేసిన వారిలో ఎవరెవరు ఉన్నారనే జాబితాను అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. ఈ జాబితాను సిద్ధం చేసేందుకు వీలుగానే గురువారం నాడు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భేటీ అయ్యింది.

ఇద్దరు ఈఎన్‌సీలతో భేటీ..

బుధవారం ఉదయం 10.30 గంటలకు బీఆర్‌కే భవన్‌లోని 8వ అంతస్తులో కేటాయించిన కమిషన్ కార్యాలయంలో విచారణను ప్రారంభించింది. గురువారం మొత్తం నీటిపారుదల శాఖకు చెందిన ఇద్దరు ఈఎన్‌సీలు నాగేందర్‌రావు, అనిల్‌కుమార్‌లతోనే కమిషన్ లోతుగా చర్చించి నట్టు తెలుస్తుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకధాటిగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధానాంశాలన్నింటినీ కూడా ఇద్దరు ఈఎన్‌సీలు వివరిం చినట్టు తెలుస్తుంది.

ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కూడా ఇచ్చినట్టు సమాచారం. పైగా మంగళవారం ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీ ఎస్‌ఏ) నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు.. మేడిగడ్డ బ్యారేజీకి చేయాల్సిన మరమ్మత్తులపై మధ్యంతర నివేదిక అందింది. దీనిపైకూడా కమిషన్‌తో ఇరువురు ఈఎన్‌సీలు చర్చించినట్టు సమాచారం.

ఈ వర్షాకాలంలో బ్యారేజీలు మరింత దెబ్బతినకుండా.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన సూచనల ప్రకారం ముందుకు సాగాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈఎన్‌సీలకు స్పష్టమైన సూచనలు చేసినట్టు సమాచారం. అలాగే ఎన్‌డీఎస్ ఇచ్చిన మధ్యంతర నివేదికలో పొందుపర్చిన సాంకేతికపరమైన చర్యలకు సంబంధించికూడా కమిషన్ లోతుగా ఈఎన్‌సీలతో చర్చించనట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులతో గురువారం సమావేశం కావా లని కమిషన్ నిర్ణయించినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారణకు పిలుస్తానంటూ ముందుగానే చెప్పడం తో.. ఇప్పుడు ఎవరెవరికి నోటీసులు పంపించడం షురూ చేసేరనేదానిపై అందరూ దృష్టి కేంద్రీకరించారు. బుధవారం ఈఎన్‌సీలతో చర్చ సందర్భంగా నోటీసులు పంపించాల్సిన జాబితాపైకూడా చర్చించినట్టు సమాచారం. అందుకు అనుగుణంగానే కమిషన్ సెక్రెటరీ ద్వారా గానీ.. లేదా న్యాయవాది ద్వారా గానీ నోటీసులు జారీచేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి నోటీసులు జారీ షురూ అయ్యింది.

ఈనెల 12 వరకు నీటిపారుదల శాఖ అధికారులు, ప్రాజెక్టులో పనులు చేసిన ఇంజనీర్లు, ఇతర అధికారులతో కమిషన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈనెల 12 న తిరిగి కొల్‌కతాకు కమిషన్ వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. మూడో విడతలో ఇప్పుడు నోటీసులు ఇచ్చిన వారి నుంచి సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఇద్దరు ఈఎన్‌సీల నుంచి లోతుగా చర్చించిన పిదప వారి నుంచి వాంగ్మూలాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. శుక్ర, శని వారాల్లోనూ ఇలాగే అధికారులతో కమిషన్ సమావేశమై సమాచారాన్ని సేకరించనున్నారు.

ప్రత్యేక అధికారుల నియామకం..

ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కార్యకలాపాలు చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించిన విషయం తెలిసిందే. హైకోర్టులో రిజిస్ట్రార్‌గా పనిచేసిన మురళీధర్‌రావును కమిషన్ సెక్రెటరీగా నియమించారు.

దీనితోపాటు కమిషన్ తరఫున వాదనలు వినిపించేందుకు వీలుగా ఒక సీనియర్ న్యాయవాదిని కూడా నియమించుకున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల ప్రతిసారీ కమిషన్ సమాచారం అందించడం కాకుండా.. తన న్యాయవాది ద్వారా సమాచారాన్ని అందించే అవకాశం ఉంటుంది.