అగమ్యగోచర రణం
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుద్ధం ప్రారం భమై 11 రోజులైంది. అమెరికా, ఇజ్రాయెల్ ఏకమై ఇరాన్‌పై విరుచు కుపడుతున్నాయి. అయితే.. యుద్ధ ప్రభావాలు మాత్రం ప్రపంచ దేశాలపై పడింది. క్రమంగా గ్లోబల్ మార్కెట్ కుదేలవుతూ వస్తున్నది. ముడి చమురు, ఎల్పీజీ, గ్యాస్ రవాణాకు అడ్డంకులు ఏర్పడటంతో సరఫరా ఆగిపోయింది. ఇరాన్ వ్యూహాత్మకంగా హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతోనే ఈ పరిస్థితి వచ్చింది.
గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచానికి చమురు సరఫరా చేసే ప్రధాన మార్గం ఇదే. ఇరాన్ జల సంధినని దిగ్బంధించడం కారణంగా చమురు రవాణా నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనివల్ల భారత్‌తోపాటు ఎన్నో దేశాలకు ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. ఎల్పీజీ సరఫరా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూటకో మాట మాట్లాడుతున్నారు.
ఇరాన్ అణు పరీక్షలు చేస్తోందని, తాము వద్దన్నా ఇరాన్ వినడం లేదని, ఇరాన్ అణు సామర్థ్యం పెరిగితే మిత్ర దేశాలకు ముప్పు ఉంటుందని యుద్ధాన్ని సమర్థించుకున్నారు. తర్వాత.. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతం చేయడం ద్వారా, ప్రజలకు స్వేచ్ఛ లభిస్తుందని, పాలన మారితే అన్ని మారతాయని ప్రకటించారు. తాజాగా ఇటీ వల ఇరాన్ సుప్రీం లీడర్‌గా ముజ్తబా ఖమేనీ ఎన్నికైన తర్వాత, ఆయన ఎక్కు వ కాలం నిలబడలేరని, ఆయన్ను కూడా తాము వదిలిపెట్టమని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
హోర్ముజ్ జలసంధి మూతపడి ప్రపంచమంతా చమురు కోసం అల్లాడుతుంటే, ట్రంప్ మాత్రం తన సోషల్ మీడియా ఖాతాలో పొంతలేని పోస్టులు పెడుతూ బిజీగా ఉన్నారు. అలాగే, ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం ఇరాన్‌పైనే అని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఉగ్రవాద సంస్థల కార్యాలయాలను మట్టుబెడుతోంది.
హెజ్బుల్లా కీలక కమాండర్లను ఇప్పటికే హతమార్చింది. ఇరాన్ అండతో పనిచేస్తున్న సాయుధ ముఠాలను ఏరివేయడమే ఇజ్రాయెల్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ యుద్ధంలో ఇరాన్‌కు రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు మద్దతు పలుకుతున్నాయి. సిరియా సైతం అదే బాట లో నడుస్తోంది. ఏదేమైనా, యుద్ధ పర్యావసానాలు మాత్రం.. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసేలా కనిపిస్తున్నాయి. యుద్ధం ఎన్నాళ్లు నడుస్తుందో, ఎందుకు నడుస్తుందో, ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి.
భారత్ వంటి దేశాలకు యుద్ధం పెను సవాలుగా మారింది. చమురు అవసరాలకు భారత్ 80 శాతానికి పైగా దిగుమతుల పైనే ఆధారపడుతున్నది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు, గ్యాస్ నౌకలు నిలిచిపోవడంతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు సైతం పెరగడం గమనార్హం. ఇవే పరిస్థితులు అనేక యుద్ధ ప్రభావిత దేశాల్లోనూ నెలకొన్నాయి.
సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ధరల పెరుగుదల ఆర్థికపరమైన భారమే. ప్రతి గంటకు మారుతున్న పరిస్థితులు ప్రపంచ దేశాల షేర్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. మదుపర్లు ఆందోళనలో ఉన్నారు. చమురు నిల్వలు నిండుకుంటున్న దేశాలు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం త్వరగా ముగియాలని కోరుకోవడం తప్ప ప్రస్తుతానికి ప్రపంచం చేయగలిగిందేమీ లేదు.




