పాల్వాయిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
12-06-2026 12:07 AM
మల్దకల్, జూన్ 11: గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలంలోని పాల్వాయి గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. లబ్ధిదారు రంజాన్ కుటుంబానికి నూతన గృహ ప్రవేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి కానుక అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తోందన్నారు. గద్వాల నియోజకవర్గంలో తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరు కాగా, వాటి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలోనే రెండో విడత ఇళ్ల మంజూరు కూడా చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






