విద్యార్థులకు "మీ సురక్ష" అవగాహన సదస్సు
చేంగిచర్ల బిఎంఆర్ఎస్ పాఠశాలలో 100 సీసీ కెమెరాల ప్రారంభోత్సవం
ముఖ్యఅతిథిగా ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్
మేడిపల్లి,(విజయక్రాంతి): కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చేంగిచర్ల బిఎంఆర్ఎస్ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యంతో కలిసి "మీ సురక్ష" అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థుల భద్రత, సమకాలీన సామాజిక అంశాలపై పోలీస్ అధికారులు కీలక అవగాహన కల్పించారు. విద్యార్థులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు.
మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం తెలంగాణ పోలీస్ విభాగం అందిస్తున్న సేవల గురించి, అత్యవసర సమయాల్లో షీ టీమ్స్‌ను ఎలా సంప్రదించాలో తెలియజేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండటానికి, సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మాదకద్రవ్యాల మహమ్మారి వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, విద్యార్థులు వీటికి దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్, సీఐ జలంధర్ రెడ్డి, డీఐ ఎలక్షన్ రెడ్డి, ఎస్ఐ ఉదయ భాస్కర్, ఇతర పోలీస్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






