డంపింగ్ యార్డ్ తొలగింపునకు సంపూర్ణ మద్దతు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
జవహర్ నగర్,(విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే అతిపెద్ద డంపింగ్ కొండ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తొలగింపునకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న అఖిలపక్ష జేఏసీ నాయకులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం స్థానికులు జేఏసీ ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ పట్టణీకరణలో భాగంగా జవహర్ నగర్ అతిపెద్ద పట్టణంగా వెలిసినందున ప్రజలకు ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డ్ ను ఇకనైనా దూర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఏ నగరంలో లేదని అది కేవలం హైదరాబాదులోని జవహర్ నగర్ లో ఉండడం జవహర్ నగర్ ప్రజలు బాధ వర్ణనాతీతమన్నారు. ఇప్పటికైనా పార్టీలకతీతంగా డంపింగ్ యార్డ్ తరలింపునకు ప్రతి ఒక్కరు సహకరించాలని డంపింగ్ యార్డ్ తరలింపునకు ప్రభుత్వం సహకరించేలా ఒత్తిడి తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






