ఆకలితో బడికి వెళ్లే పరిస్థితి రావొద్దు
మంత్రి శ్రీధర్‌బాబు
రూ.7.5 కోట్లతో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం
మంథని, ఆగస్టు 24 (విజయక్రాంతి): పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహార అల్పాహారం అందించేందుకు పెద్దపల్లిజిల్లా మంథనిలో హరేకృష్ణ మూమెంట్స్ చారిటబుల్ పౌండేషన్ ఇండియా(హెచ్‌కేఎంసీఎఫ్ ఇండియా) ఆధ్వర్యంలో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక సెంట్రలైజ్‌డ్ కమ్యూనిటీ కిచెన్‌ను మంత్రి శ్రీధర్‌బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సోమవారం ప్రారంభించారు. పిల్లలపోషకాహారం, అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వంచేపట్టిన ప్రతిష్ఠాత్మక తెలంగాణ స్కూల్స్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్ అమలులో హెచ్‌కేఎంసీఎఫ్ ఇండియా) కీలకభాగస్వామిగా ఉంది.
కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ప్రెసిడెంట్, అక్షయ పాత్ర ఫౌండేషన్ (తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్) రీజినల్ ప్రెసిడెంట్ హిస్ గ్రేస్ సత్య గౌర చంద్ర దాస స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, హెచ్‌కేఎంసీఎఫ్ ఇండియా, సింగరేణి కాలరీస్ కంపెనీలిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) సీఎస్‌ఆర్ భాగస్వామ్యంతో ఈప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. కాగా మంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచేందుకు అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొలుత కొడంగల్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించామని, అక్కడ విద్యార్థుల హాజరు 21 శాతం పెరిగిందని పేర్కొన్నారు.మంథనిలో ఏర్పాటు చేసిన ఆధునిక వంటశాలలో గంటకు 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు. విద్యార్థులకు ప్రతిరోజూ విభిన్న రకాల టిఫిన్లు అందించేలా ప్రత్యేక మెనూను రూపొందించామని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు జిల్లాలో విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఏఎంసీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆర్జీ-3 జీఎం, తహసీల్దార్ ఆరిపోద్దిన్, మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, నాయకులు శశి భూషణ్ కాచే, లింగయ్య యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






