రేషన్ బియ్యంపై ‘డీలర్ల’ దందా?
- స్థానికులకు నో.. బయటి వారికి ఓకే!?
- ఖమ్మం నగరంలో రేషన్ బియ్యం
- పంపిణీపై పెరుగుతున్న ఆరోపణలు
ఖమ్మం ఆగస్టు 24 (విజయక్రాంతి):- పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థలో కొందరు డీలర్ల అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఖమ్మం నగరంలో కలకలం రేపుతున్నాయి. అర్హత కలిగిన స్థానిక లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా, మీ అడ్రస్ ఇక్కడ లేదు.. మీ అడ్రస్ ఉన్న ప్రాంతంలోనే బియ్యం తీసుకోవాలి అంటూ కొందరు డీలర్లు వెనక్కి పంపుతున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
అయితే ఇదే సమయంలో స్థానికంగా నివసించని కొంతమందికి మాత్రం రేషన్ బియ్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు మరింత అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్థానికులకు నిబంధనలు.. ఇతరులకు మాత్రం బియ్యం?
ఖమ్మం నగరంలోని కొన్ని రేషన్ దుకాణాల పరిధిలో తమకు బియ్యం ఇవ్వడం లేదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ నివసిస్తున్నప్పటికీ మీ రేషన్ కార్డు చిరునామా మరో ప్రాంతంలో ఉంది.. అక్కడికే వెళ్లండి అంటూ చెప్పారని కొందరు పేర్కొంటున్నారు. కానీ అదే సమయంలో రేషన్ వ్యవస్థతో సంబంధం లేని వ్యక్తులకు బియ్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అసలు రేషన్ బియ్యం ఎవరి కోసం? అర్హులైన పేదలకా.. లేక అక్రమంగా కొనుగోలు చేసే వారికా? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
రేషన్ బియ్యం పక్కదారి పడుతోందా?
ప్రభుత్వం పేదలకు ఉచితంగా లేదా సబ్సిడీపై అందిస్తున్న బియ్యం పక్కదారి పడితే దాని ప్రభావం నేరుగా అర్హులైన కుటుంబాలపై పడుతుంది. కొందరు డీలర్లు లబ్ధిదారులకు అందాల్సిన బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, బయట మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణలు మాత్రమే. సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది.
అధికారుల తనిఖీలు ఎక్కడ?
రేషన్ దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, బయోమెట్రిక్ లావాదేవీలు, పంపిణీ వివరాలు, మిగిలిన స్టాక్ను అధికారులు అకస్మాత్తుగా తనిఖీ చేస్తే అక్రమాలకు తావుందా లేదా అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా తిరస్కరించిన సందర్భాలు, అదే సమయంలో ఇతరులకు బియ్యం విక్రయించినట్లు ఉన్న ఆరోపణలపై విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజలకు అందాల్సిన బియ్యం.. అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లొద్దు
రేషన్ బియ్యం పేద ప్రజల హక్కు. ఆ హక్కును ఎవరైనా అడ్డుకుంటే లేదా ప్రభుత్వ సరుకును అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఖమ్మం నగరంలో రేషన్ బియ్యం పంపిణీపై వస్తున్న ఆరోపణలపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, రేషన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాస్తవాలను బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. స్థానికులకు బియ్యం లేదు.. బయటివారికి ఎలా వస్తోంది? అనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.






