వరంగల్ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి!
- ఓవైపు గ్రూపులు.. మరోవైపు
- స్వపక్షంలోనే విపక్షం
- అంతర్గత పోరుతో సతమతం
- ‘కొండా’ తలపోటుతో పార్టీలో గందరగోళం
వరంగల్, ఆగస్టు 24 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో 10 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలుచుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలతో సతమతమవుతుండగా, ఇప్పుడు కొత్తగా ‘కొండా’ తలపోటుతో పార్టీ క్యాడర్‌లో గందరగోళం నెలకొంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డాక్టర్ భూక్యా మురళి నాయక్, డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, దొంతి మాధవరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, మామిడాల యశస్వినీ రెడ్డి మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో ప్రత్యర్థులను ఓడించారు.
దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విధంగా మారింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ నుంచి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీ అసోసియేట్ గా పనిచేస్తుండడంతో మరింత బలాన్ని చేకూర్చింది.ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూపు తగాదాలు ప్రారంభమయ్యాయి.
కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో గ్రూపులు నివురు గప్పిన నిప్పులా ఉండగా, మరి కొన్ని నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య విభేదాలు బాహటంగానే కొనసాగుతున్నాయి.పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల నుంచి మొదలుకొని మండల అధ్యక్షుల వరకు, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు, చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక వ్యవహారంలో కూడా విభేదాలు పొడసుపాయి.
దీనికి తోడు రాష్ట్రంలో జిల్లా నుంచి కీలక బాధ్యతల్లో ఉన్న రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గ పోరుకు కొంత ఆజ్యం పోస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.కొత్తగా పార్టీలో చేరి టిక్కెట్లు సాధించి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన కొందరు ఎమ్మెల్యేలు కూడా పాత కాంగ్రెస్ క్యాడర్ ను పూర్తిగా పక్కనపెట్టి తమ అనుచరులకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు కూడా ఇటీవల పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో మినహా చాలాచోట్ల ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులు కొనసాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గోటి చుట్టూ రోకటి పోటులా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ‘కొండా’ వ్యవహారం మారింది అంటున్నారు.
మంత్రి కొండా సురేఖ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి, ప్రభుత్వానికి కొంత చెడ్డపేరు వచ్చిందని, ఇటు ఆమె కుమార్తె సుస్మిత పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వరంగల్ ఉమ్మడి జిల్లా పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి.
కొండ సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలకు పీసీసీకి వివరణ ఇచ్చుకున్నప్పటికీ, వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ నేతల్లో కొందరు కొండా సురేఖకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు గ్రూపు తగాదాలకు తోడు, ‘కొండా’ వ్యాఖ్యల తలపోటుతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.






