25 August, 2026 | 1:02 AM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె

24-08-2026 11:26 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చేయాలనే లక్ష్యంతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెల్లడించారు. ములకలపల్లి మండలంలో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించి పాత గుండాలపాడు గ్రామంలో రచ్చబండ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ముందుగా పాత గుండాలపాడు గ్రామపంచాయతీ పరిధిలో ఆరు కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు, పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు.ప్రజలు అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వెళ్లేలా  పాతగుండాలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు, మండల ఉన్నతాధికారులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను నేరుగా వేదిక దృష్టికి తీసుకువచ్చారు. పోడుభూములు,ఇందిరమ్మ ఇండ్లు, తాగునీరు, రహదారులు, విద్యుత్,విద్య,వైద్యం పారిశుద్ధ్యం,ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు,స్థానిక నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.