1 August, 2026 | 2:26 AM

భవనం కూలి 10 మంది మృతి

01-08-2026 01:43 AM

శిథిలాల కింద మరికొందరు

మహారాష్ట్రలోని భివండీలో ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ

ముంబై, జూలై 31: మహారాష్ట్ర భివండిలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నాలుగంతుస్థుల భవనం కూలి 10 మంది మృతి చెందారు. మరి కొంతమంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. రెస్క్యూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ భవనాన్ని గతంలోనే ప్రమాదకరమైనది ప్రకటించి కూల్చివేయాలని ఆదేశించింది. దీంతో భవన యాజమాని గురువారం అనధికారికంగా మరమ్మతు పనులు కొనసాగిస్తుండగా అర్థరాత్రి భవనం కూలిపోయింది.

నాలుగంతస్తుల భవనంలో మొత్తం 48 గదులున్నాయి. శుక్రవారం కూడా రెస్క్యూ బృందాలు శిథిలాలను కింద చిక్కుకున్న వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, స్థానిక అగ్నిమాపక, పోలీసు, డాగ్‌స్కాడ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మృతి చెందిన వారంతా భవనం మరమ్మతులో పాల్గొన్న కార్మికులేనని స్థానికులు తెలిపారు. పగుళ్లను గమనించి ముందుగానే హెచ్చరించామని మున్సిపల్ కమిషనర్ అరవింద్ ఘోగారే చెప్పారు.