18 August, 2026 | 3:05 AM

ఆదాయపు పన్ను ఎగవేత తీవ్రమైన నేరం

18-08-2026 12:00 AM

ఆదాయపు పన్ను కమిషనర్ షానవాజ్ ఉల్ రహమాన్

ముషీరాబాద్,ఆగస్టు 17(విజయక్రాంతి): ఆదాయపు పన్ను ఎగవేత తీవ్రమైన నేరమని, పన్ను చెల్లింపుదారులకు పూర్తి సహకారం అందిస్తూ వారి ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) షానవాజ్ ఉల్ రహమాన్ తెలిపారు. సికింద్రాబాద్లోని తాజ్ త్రీస్టార్ హోటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టాక్స్ బార్ అసోసియేషన్, ఆదాయపు పన్ను శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సీఏలు, పన్ను న్యాయవాదుల కోసం టి.డి.ఎస్., ఐ.టి.ఆర్. ఫైలింగ్, సి.పి.సి. ప్రాసెసింగ్ తదితర అంశాలపై ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు.

కార్యక్రమాన్ని షానవాజ్ ఉల్ రహమాన్ ప్రారంభించగా ఎస్.ఏ. మతివనన్, బి. మాలతీ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.ఉద్దేశపూర్వకంగా ఆదాయాన్ని తక్కువగా చూపించడం, అర్హత లేని మినహాయింపులు పొందడం, విదేశాల్లో డబ్బు లేదా ఆస్తులను దాచడం వంటి చర్యలు చట్టపరంగా తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయని షానవాజ్ ఉల్ రహమాన్ హెచ్చరించారు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు గడువులోగా దాఖలు చేయాలని సూచించారు.

పన్ను చెల్లింపుల ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలక బాధ్యత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.పి. దహిమ, కార్యదర్శి సీఏ పి.వి. నారాయణ రావు, కోశాధికారి పంకజ్ సంచేటి, సలహాదారులు అమృత్ కుమార్ కోట, రాందేవ్ బుతాడా, పూర్వ అధ్యక్షులు చంద్రశేఖర్ వేముల, కె. దేవదాస్, ఈశ్వరన్ తదితరులు పాల్గొన్నారు.