8 May, 2026 | 7:49 AM

రేపటి నుంచి నిరవధిక సమ్మె

23-06-2024 01:31 AM
  1. ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల అల్టిమేటం
  2. తెలంగాణలో రెండో రోజుకు చేరిన నిరసనలు
  3. గాంధీ ఆస్పత్రిలో కళ్లకు గంతలతో ఆందోళన
  4. డిమాండ్లు నెరవేర్చాలని సర్కారుకు విజ్ఞప్తి

కంటోన్మెంట్, జూన్ 22 (విజయక్రాంతి): తమ డిమాండ్లను నెరవేర్చాలని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 24 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంపై తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జూడాలు రెండు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో శనివారం వినూత్నరీతిలో ఆందోళనకు దిగారు. కళ్లకు గంతలతో తమ ఆవేదనను వెలిబుచ్చారు.

గ్రీన్ ఛానెల్ ద్వారా సకాలంలో స్టుఫైండ్ ఇవ్వాలని, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు సరైన గౌరవ వేతనం అందించాలని కోరారు. తెలంగాణలో ఏపీ విద్యార్థుల 15 శాతం సీట్ల రిజర్వేషన్ ఎత్తివేయాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. మెడికోలకు వంద శాతం హాస్టల్ సౌకర్యం కల్పించాలని, ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మించాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు, మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలని చెప్పారు.

కాకతీయ మెడికల్ కాలేజీలో రహదారులు నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జూడాల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహర్ష, గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హారీష్, పీజీలు, హౌస్ సర్జన్‌లు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.