నీట్‌ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలి
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాల నిరసనలు
హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంటి ముట్టడి.. పలువురి అరెస్ట్
నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్ ఇంటి ముందు ఆందోళన
హైదరాబాద్ సిటీబ్యూరో/ మెదక్/ నిజామాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): నీట్‌ను రద్దు చేసి, తిరిగి నిర్వహించి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, వీజేఎస్, యూత్ కాంగ్రెస్, డీవైఎఫ్‌ఐ, పీవైఎల్, ఏఐవైఎఫ్, వైజేఎస్ సంఘాలకు చెందిన నాయకులు, విద్యార్థులు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం నాయకులంతా కలిసి హైదరాబాద్‌లో ర్యాలీగా వెళ్లి కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. కేంద్రమంత్రిని అపాయింట్‌మెంట్ కోరగా, ఆయన అందుకు నిరాకరించారన్నారు.
కిషన్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలపై కేంద్రం సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కులు వచ్చిన వారికి మాత్రమే రీ ఎక్జామ్ నిర్వహించడమంటే, నీట్ అవకతవకలను పక్కదారి పట్టించడమేనన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై బీహార్‌లో 13 మందిని అరెస్ట్ చేశారని, హర్యానాలో ఒకే రూంలో పరీక్ష రాసిన ఎనిమిది మంది విద్యార్థులకు టాప్ ర్యాంకులు వచ్చాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీ అయిందన్నారు. పోలీసులు కేంద్ర మంత్రి ఇంటివద్దకు చేరుకుని విద్యార్థి సంఘం నాయకులను అడ్డుకొని కాచిగూడ, నల్లకుంట పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
ధర్నాలో వివిధ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు బల్మూర్ వెంకట్, దామెర కిరణ్, ఆజాద్, పుట్ట లక్ష్మణ్, నాగేశ్వర్‌రావు, అరుణ్, అభిజిత్ యాదవ్, ఆనగంటి వెంకట్, కేఎస్ ప్రదీప్, ధర్మేంద్ర, రవి, సలీం పాల్గొన్నారు. అలాగే పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్‌లోని ఎంపీ ధర్మపురి అర్వింద్ క్యాంప్ కార్యాలయంతోపాటు ఎన్జీవోస్ కాలనీలోని ఆయన నివాసాన్ని పీడీఎస్‌యూ, ఏఐపీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, విద్యార్థులు ముట్టడించారు.
నీట్‌ను రద్దు చేయించేందుకు ఎంపీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నినాదాలు చేశారు. మెదక్ పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు కార్తీక్, శివ, కార్తీక్, నవీన్ విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రధాని మోదీ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. నిర్మల్ జిల్లాకేంద్రంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో నాయకులు వెంకటేశ్, పవన్, వినోద్, ధ్రువ, అరుణ్ నిరసన కార్యక్రమం చేపట్టారు.






