15-02-2026 12:09:27 AM
‘క్యాంపు’ టెన్షన్.. ఎవరికో చాన్స్!
కామారెడ్డి/మహబూబాబాద్/నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు, ఆయా పార్టీ ల అగ్రనేతలకు, ముఖ్యమంత్రి, మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబరాలు ఏం తెచ్చాయో ఏమో కానీ టెన్షన్ మాత్రం తప్ప క తెచ్చిపెట్టాయి. విజేతలైన కౌన్సిలర్లను ఆ యా పార్టీలు ఒడిసిపట్టుకుని వారిని క్యాం ప్‌లకు తరలించి, చేజారకుండా భద్రంగా కాపాడుకుంటున్నాయి.
ఈ క్యాంప్‌ల టెన్షన్ ఒక ఎత్తుతై.. మేయర్, డిప్యూటీమేయర్, చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌లను ఎవరిని చేయాలోనని తర్జనభర్జన పడుతున్నాయి. మరోపక్క గెలిచిన అభ్యర్థులు కూడా ‘ఈ చాన్స్’ ఎవరిని వరిస్తుందోనని ఎదురుచూస్తున్నా రు. ఈ మొత్తం తతంగంలో స్వతంత్రులే కీలకంగా మారడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నా యి. కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని రాజకీయ పరిస్థితులపై కథనం..
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సి పాల్టీలకు చైర్మన్‌లు ఎవరు అవుతారని ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, బి చ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన మెజార్టీ కౌన్సిలర్లు గెలుపొందడంతో కాంగ్రెస్‌కు చెందిన వారే మున్సిపల్‌చైర్మన్‌గా ఎన్ని కయ్యే అవకాశాలున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న మున్సిపాలి టీలకు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై స్థానిక ఎమ్మెల్యేలకే హైకమండ్ ఫైనల్ చేసేందుకు అవకాశం కల్పిస్తుందా లేక అభ్యర్థి పేరును నిర్ణయించి, సీల్డ్ కవర్ ద్వారా పంపిస్తారా అనేది వేచిచూడాల్సిందే.
కాంగ్రెస్ మున్సిపాలిటీలలో సైతం గెలిచిన కౌన్సిలర్లను క్యాంపు లకు తరలించారు. ఈనెల 16న మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ఉండడంతో అదేరోజు క్యాంపులో నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి కౌన్సిలర్లను తీసుకువచ్చి ఓటింగ్‌లో పాల్గొనేలా పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ గెలిచిన 16 మంది కౌన్సిలర్లు నాందేడులోని క్యాంపునకు తరలించారు.
కాంగ్రెస్ పార్టీ గెలిచిన 19 మంది కౌన్సిలర్లతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు హస్తం శిబిరంలోనే ఉన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లను ఆయా పార్టీల పెద్దలు హైదరాబాద్‌లో వేర్వేరుగా క్యాంపులు ఏర్పాటు చేసి తరలించారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లు అందరూ క్యాంపు ల్లో గడుపుతున్నారు. శివరాత్రి అయినా క్యాంపులోనే ఉం డాల్సిందని పార్టీ పెద్దలు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.
బీసీ మహిళా చైర్‌పర్సన్ ఎవరో..!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం పూర్తి మెజార్టీ ఏ పార్టీకి రాకపోవడంతో చైర్‌పర్సన్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ మున్సిపాలిటీని దక్కించుకోవడానికి రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తర్జనభర్జన పడుతున్నాయి. బీసీ మహిళ రిజర్వు కావడంతో బీసీ మహిళను మున్సిపల్ చైర్పర్సన్‌గా ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో చైర్‌పర్సన్ ఎవరనే పరిషాన్‌తోపాటు మేజిక్ ఫిగర్ కోసం రెండుపార్టీలు వేటాడుతున్నాయి.
అధికార పార్టీ కాంగ్రెస్‌కు 19మంది వార్డ్ కౌన్సిలర్లు గెలుపొందారు. ముగ్గురు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్‌లో చేరారు. దీంతో 22 మంది కౌన్సిలర్ల బలం ఉంది. మరో నలుగురు కౌన్సిలర్లు మద్దతు ఇస్తేనే కాంగ్రెస్ అభ్యర్థి చైర్‌పర్సన్‌గా గెలిచే అవకాశం ఉంది. ఇందుకోసం కాంగ్రెస్ బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మద్దతు కోసం ప్రయత్ని స్తోంది. బీజేపీ 16 మంది కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో మూడు ఓట్లతో బీజేపీ బలం ౧౯గా ఉంది.
అయితే బీజేపీ చైర్‌పర్సన్‌ను దక్కించుకోవాలంటే మరో ఏడుగురు అవసరం. అయితే 12 మంది కౌన్సిలర్లను గెలిచిన బీఆర్‌ఎస్ బీజేపీకి మద్దతిస్తే చైర్‌పర్సన్ సీటు బీజేపీ దక్కించుకునే వీలుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ మెజార్టీస్థానాలు సాధించిన బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల చైర్మన్‌లపై కసరత్తు కోనసాగుతోంది.
విహారయాత్రలో వరంగల్ కౌన్సిలర్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు నిర్వహించిన ఎన్నికల్లో గెలిచిన విజేతలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు విహారయాత్రకు తరలించాయి. అయితే చైర్‌ప ర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికల నేపథ్యంలో వార్డు కౌన్సిలర్లు చేజారిపోకుండా వారిని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ లు క్యాంపులకు తరలించాయి. క్యాంపుల్లో ఉన్న కౌన్సిలర్లు రాష్ట్ర రాజధానితోపాటు ఇతరప్రాంతాల్లో విహారయాత్ర చేస్తున్నారు. క్యాంప్‌లోని కౌన్సిలర్లు ఈనెల 16న ప్రత్యేక జనరల్ బాడీకి నేరుగా హాజరయ్యే విధంగా ఆయా పార్టీల నాయకులు ప్లాన్ చేశారు.
కేటీఆర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
క్యాంపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో విజ యం సాధించిన 8 మంది వార్డు కౌన్సిలర్లు శనివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు.
కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌లో..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీల్లో మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి తలనొ ప్పు తప్పడం లేదు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 24 వార్డులకు 18స్థానాల్లో కాంగ్రె స్, ౬ స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించాయి. చైర్మన్ బీసీ జనరల్ కేటాయించగా ప్రస్తుతం గెలిచిన అభ్యర్థుల్లో అత్యధికలు బీసీలే ఉన్నారు. దీంతో చైర్మన్, వైస్‌చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. కల్వకుర్తి మున్సిపాలిటీలో చైర్మన్‌పీఠం జనరల్ మహిళ రిజర్వ్. ఇక్కడ ఏడోవార్డు అభ్యర్థి రత్నమాలను చైర్మన్‌కుర్చీ వరించనుంది. కొల్లాపూర్ లో చైర్మన్ బీసీ మహిళ రిజర్వు కావడంతో అభ్యర్థులు అత్యధికంగా పోటీలో ఉన్నారు. దీంతో ఆశావహులు పోటీ పడుతున్నారు.
బీజేపీలో చేరిన ఇద్దరు స్వతంత్రులు
కరీంనగర్ కార్పొరేషన్‌లో 39 డివిజన్ స్వతంత్ర అభ్యర్థి మాసం గణేష్, 17 డివిజన్ అభ్యర్థి వేముల కవిత కేంద్రమంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
మున్సిపల్ పీఠాల కైవసానికి చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

సంగారెడ్డి, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మున్సిపల్ పీఠాలను బీఆర్ ఎస్ కైవసం చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్ గెలుపొందగా, హంగ్ ఏర్పడిన ఇంద్రేశం, జిన్నారం, ఇస్నాపూర్ మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు స్వతంత్ర అభ్యర్థులను పార్టీలో చేర్చుకుంటున్నారు.
అందులో భాగంగా శనివారం ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం మున్సిపల్ పరిధిలో గెలిచిన ముగ్గురు స్వతంత్ర కౌన్సిలర్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ ఎల్లకొండ రాహుల్‌రెడ్డి, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు కౌన్సిలర్ సార లావణ్య, జిన్నారం మున్సిపాలిటీకి చెందిన 9వ వార్డు స్వతంత్ర అభ్యర్థి శ్రీలత నాగరాజుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులై, బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల కృషితో పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(జీఎంఆర్) తెలిపారు.