ఎజెండా ప్రతులు లేకుండా.. సమావేశం ఎలా?
* అచ్చంపేట మండల సర్వసభ్య సమావేశంపై ప్రజాప్రతినిధుల విస్మయం
* ఖాళీ కుర్చీలపై ఎమ్మెల్యే ఆగ్రహం
* సర్పంచి భర్తను బయటకు పంపిన పోలీసులు
అచ్చంపేట: మండల స్థాయిలో గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, శాఖల పనితీరుపై సమీక్షించాల్సిన సర్వసభ్య సమావేశం అచ్చంపేటలో అధికారుల తీరుతో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశానికి ఎజెండా ప్రతులు లేకుండానే సమావేశం నిర్వహించారు.
సాధారణంగా సమావేశానికి ఒకరోజు ముందుగానే ఆయా శాఖల వారీగా చర్చించాల్సిన అంశాలతో కూడిన ఎజెండా ప్రతులను సర్పంచులకు అందజేస్తారు. వాటి ఆధారంగా గ్రామాల్లో జరుగుతున్న పనులు, పథకాల అమలు, సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అయితే అచ్చంపేట సమావేశంలో ఎజెండా ప్రతులు పంపిణీ చేయకపోవడంతో సర్పంచులు అధికారులు వెల్లడించిన అంశాలను వినడానికే పరిమితమయ్యారు.
* బాధ్యత మరిచారా?
సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీడీవో అరుంధర్‌రావు ఎజెండా ప్రతులు లేకుండానే సమావేశాన్ని కొనసాగించడం చర్చకు దారితీసింది. మండల ప్రత్యేక అధికారి, ఆర్డీవో యాదగిరి కూడా సమావేశంలో జరిగిన పరిణామాలను గమనించినా ఎజెండా ప్రతులపై ప్రశ్నించకపోవడం అధికార వర్గాల్లో విస్మయం కలిగించింది. దీంతో గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు సమావేశం ముగిసిన అనంతరం ఖాళీ చేతులతోనే వెనుదిరిగారు.
* ఖాళీ కుర్చీలపై ఎమ్మెల్యే ఆగ్రహం
తమ శాఖల సమీక్ష పూర్తికాగానే కొంతమంది మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమావేశం నుంచి వెళ్లిపోవడంతో వెనుక వరుసల్లో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. దీనిపై ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభం నుంచి ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరై ఉండాలని స్పష్టం చేశారు. సర్పంచులు సమావేశాలకు హాజరు కావడం ఇబ్బందిగా భావిస్తే పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
* సర్పంచి భర్తపై ఆగ్రహం
సమావేశం ప్రారంభంలో కొందరు సర్పంచుల భర్తలు పాల్గొనడంతో సర్పంచులు, అధికారులు మినహా ఇతరులు బయటకు వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. వారు బయటకు వెళ్లినా.. సమావేశం మధ్యలో ఘనపూర్ సర్పంచి చిన్ని భర్త మళ్లీ సమావేశంలో పాల్గొన్నారు. చివరి దశలో తన గ్రామంతో పాటు ఇతర సమస్యలను పదేపదే ప్రస్తావిస్తూ సమావేశాన్ని సాగదీశారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారులు, ఎమ్మెల్యే వారించినా వినకపోవడంతో పోలీసులు రప్పించి ఆయనను సమావేశ మందిరం నుంచి బయటకు పంపించారు. సర్పంచుల తరఫున సమస్యలు చెప్పేందుకు వారి భర్తలు వచ్చి అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత సర్పంచులే సమావేశంలో ప్రస్తావించాలని సూచించారు.






