calender_icon.png 15 February, 2026 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రైలర్ మాత్రమే.. సినిమా మిగిలే ఉంది!

15-02-2026 12:08:23 AM

పార్టీ పెడతామనగానే కారు కూతలా? 

కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో బీఆర్‌ఎస్ అట్టర్ ఫ్లాప్

బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు

సీపీఐ అడగకుండానే బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటిస్తోంది

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): తాము రాజకీయ పార్టీగా వస్తామని చెప్పగానే బీఆర్‌ఎస్ వాళ్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారని, మున్సిపల్ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా మిగిలే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఇప్పుడే కారు కూతలు కూయకండి అని హె చ్చరించారు.

ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, ప్రజలకు ప్రత్యామ్నాయం లేకపోవటంతోనే కాంగ్రెస్‌కు ఓటు వేశారన్నారు. శనివారం జాగృతి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ప్రజలు మాకు గుడి కట్టారంటూ ప్రచారం చేసుకుంటున్న బీఆర్‌ఎస్ చాలా చోట్ల మూడు, నాలు గు స్థానాలకు పడిపోయిందని ఎద్దేవా చేశా రు. తెలంగాణకు రూపాయి ఇవ్వని బీజేపీ కరీంనగర్ మేయర్ స్థానం తప్ప అన్ని చోట్ల అష్టకష్టాలు పడిందన్నారు. కానీ ఈ ఎన్నికల్లో మాలాంటి కొత్త వారిని ప్రజలు ఆదరించారని తెలిపారు.

వడ్డెపల్లిలో మాకు క్లియర్ మాన్ డేట్‌ను ప్రజలు కట్టబెట్టారని, కానీ కాంగ్రెస్ వాళ్లు ప్రలోభాలు పెట్టి వారిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తమకు 17 స్థానాలు వచ్చుడే ఎక్కువ అన్నట్లుగా మాట్లాడారని కాంగ్రెస్ అపొజిషన్‌లో ఉన్నప్పుడు ఉన్న స్థానాలతో ఆయన పోల్చుకుంటున్నారని తెలిపారు. కానీ బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దానితో పోల్చుకుంటే కారుపార్టీ చాలా స్థానాలు కోల్పోయిందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి నేనే రాజు, నేనే మంత్రి అంటున్నారని, పదేళ్లు ముఖ్యమంత్రి నేనే.. నాకు ఆరు నెలలు బోనస్ వస్తుందని చెబుతున్నారని, ముందు రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా భావించాలన్నారు. కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే వారికి మద్దతు అని కేటీఆర్ చెబుతున్నారని, గతంలో తోక పార్టీ అని చెప్పిన పార్టీకే ఇప్పుడు బీఆర్‌ఎస్ తోక పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. సాంబశివరావు కాళేశ్వరం విషయంలో అసెంబ్లీలో కేసీఆర్‌పై ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఆ పార్టీకి మద్దతి వ్వటమంటే కేసీఆర్‌పై చేసిన ఆరోపణలను బీఆర్‌ఎస్ అంగీకరించినట్లేనని అన్నారు.