గ్లోబల్ హెల్త్ హబ్‌గా భారత్
130 బిలియన్ డాలర్ల దిశగా ఫార్మా రంగం
ఫార్మారంగ నిపుణులు
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): భారతదేశం ఆరోగ్యాన్ని ఒక ప్రపంచ బాధ్యతగా భావిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయమైన వన్ ఎర్త్, వన్ హెల్త్ మరియు వసుధైవ కుటుంబకం అనే భావనలకు మన ఫార్మా రంగమే నిదర్శనమని నిపు ణులు పేర్కొంటున్నారు. వారు మాట్లాడుతూ.. ‘నాణ్యత, అందుబాటు ధరలు, నమ్మకమైన సరఫరా వ్యవస్థతో భారత్ నేడు జగమె రిగిన ప్రపంచ ఔషధాల కేంద్రంగా నిలిచింది. గత 12 ఏళ్లలో వ్యూహాత్మకంగా ఎదిగిన ఈ పరిశ్రమ విలువ సుమారు 20 బిలియన్ డాలర్ల నుండి 60 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
కోవిడ్- 19 మహమ్మారితో పాటు పశ్చిమ ఆసియా భౌగోళిక సంక్షోభ సమయాల్లోనూ ప్రపంచానికి నిరంతరాయంగా మం దులను సరఫరా చేసిన భారతదేశం, వ్యాక్సిన్ మైత్రి ద్వారా ‘విశ్వ మిత్ర’గా తన విశ్వసనీయతను చాటుకుంది. ఇదే వేగంతో దూసుకుపో తూ 2030 నాటికి భారత ఫార్మా రంగం 130 బిలియన్ డాలర్ల మార్కును అందుకోవడమే కాకుండా, 50 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
భారత ఔషధ ఎగుమతులు 2015 ఆర్థిక సంవత్సరంలో 14 బిలియన్ డాలర్ల నుండి 2026 నాటికి 31 బిలియన్ డాలర్లకు పెరిగి, 7.22 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేశాయి. పరిమాణ పరంగా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భార త్, అంతర్జాతీయ జనరిక్ మందుల డిమాండ్లో 20 శాతాన్ని భర్తీ చేస్తూ 200కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇందులో 60 శాతం ఎగుమతులు అత్యంత కఠినమైన నియంత్రణలు గల అంతర్జాతీయ మార్కెట్లకే వెళ్తుండటం విశేషం.
ముఖ్యంగా అమెరికా మనకు అతిపెద్ద మార్కెట్గా నిలిచింది. భారత్ నుండి అమెరికాకు జరుగుతున్న ఎగుమతుల విలువ దాదాపు 10.5 నుండి 15 బిలియన్ డాలర్లకు చేరింది, ఇది గతంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికం. అమెరికా వెలుపల అత్యధికంగా భారత్లోనే 1000కు పైగా యూఎ స్ ఎఫ్డీఏ ఆమోదిత కేంద్రాలు ఉండటం మన నాణ్యతకు నిదర్శనం. అలాగే ఫ్రాన్స్, బ్రెజిల్, యూకే, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.
ఇటీవల కుది రిన ఇండియా- ఈఎఫ్‌టీఏ వాణిజ్య ఒప్పందం ద్వారా బయోసైన్సెస్, పరిశోధన రంగాల్లో 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి’ అని చెప్పా రు. భవిష్యత్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని బయోసిమిలర్స్, జీన్ థెరపీలు, వ్యాక్సిన్లు, మెడికల్ డివైసెస్, ముడి పదార్థాల స్వయం సమృద్ధిపై భారత్ దృష్టి సారించింది. ఇందు లో భాగంగా రూ.10 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ’బయోఫార్మా శక్తి’ వంటి కార్యక్రమాలు రాబోయే ఐదేళ్లలో క్లినికల్ ట్రయల్స్ మౌలిక వసతులను, పరిశోధనలను మరింత బలోపేతం చేయనున్నాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ద్వారా విదేశీ సంస్థలు భారత్లో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతూ, 30 వేల మందికి పైగా నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయి.






