16 July, 2026 | 5:31 PM

ఈవీఎం ట్యాంపరింగ్‌పై సుప్రీంకు ఇండియా కూటమి

12-12-2024 12:10 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. శుక్రవారం వరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. పునేలోని హడప్సన్ స్థానం అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎన్సీపీ(శరద్‌పవార్ వర్గం)నుంచి పోటీ చేసి ఓడిన ప్రశాంత్ జగ్‌తాప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ తదితరులు పాల్గొన్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జగ్‌తాప్ వెల్లడించారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు వరకు కూడా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేశారని జగ్‌తాప్ ఆరోపించారు.

పొత్తు ప్రసక్తే లేదు: అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమితో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సీట్లను పంచుకుంటుందని ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. దాదాపు పొత్తులో సీట్ల సర్దుబాటు పూర్తయిందని ఓ వార్తా సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అదేం లేదంటూ స్పష్టతనిచ్చారు. ‘ఢిల్లీ ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం.. ఎవరితోనూ మాకు పొత్తు లేదు’ అని మాజీ సీఎం పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ పార్టీలు అంతగా విజయవంతం కాలేదు.