మహీంద్రా సస్టెన్ రూ.21 వేల కోట్ల పెట్ట్టుబడులు
పునరుత్పాదక ఇంధన రంగంలోకి మహీంద్రా గ్రూప్
ముంబై, మే 6: మహీంద్రా గ్రూప్ రెన్యువబుల్ ఎనర్జీ సబ్సిడరీ మహీంద్రా సస్టెన్ వచ్చే ఐదేండ్లలో రూ.21,000 కోట్లు పెట్టుబడి చేయాలని ప్రతిపాదించింది. ఈ పెట్టు బడితో 5.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధ న ప్రాజెక్టుల్ని నెలకొల్పాలని యోచిస్తున్నట్టు మహీంద్రా సస్టెన్ ఎండీ దీపక్ ఠాకూర్ చెప్పారు. తమ కంపెనీలో 39 శాతం భాగస్వామి అయిన ఆన్‌టారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్‌తో కలిసి ఈక్విటీ పెట్టుబడులు చేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడిస్తూ ఈ వ్యాపార ప్రణాళికకు షేర్‌హోల్డర్ల ఆమోదం లభించినట్టు తెలిపారు.
రెన్యువబుల్ ఎనర్జీ రౌండ్ ది క్లాక్ ఉత్పాదక ప్లాంట్లతో పాటు స్టోరేజ్ ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరిలో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం సస్టునబుల్ ఎనర్జీ ఇన్‌ఫ్రా ట్రస్ట్ పేరుతో ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ను మహీంద్రా గ్రూప్, ఆన్‌టారియో టీచర్స్ స్పాన్సర్ చేశాయని, ఇది రూ.1,365 కోట్ల ప్రాధమిక మూలధనాన్ని సమీకరించినట్టు కంపెనీ ఎండీ వివరించారు. గత నెలలో కంపెనీ మహారాష్ట్రలో రూ.1,200 కోట్లతో 150 మెగావాట్ల సోలార్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.






