టీమిండియా సాధన షురూ
30-05-2024 01:32 AM
టీ20 ప్రపంచకప్
రోహిత్ సేన కఠోర ప్రాక్టీస్
కోహ్లీ వర్సెస్ రోహిత్.. బుమ్రా వర్సెస్ జడేజా.. సూర్య వర్సెస్ సిరాజ్.. ఇటీవలే ఐపీఎల్ సీజన్‌లో కత్తులు దూసుకున్న ఆటగాళ్లంతా ఇప్పుడు ఏకమయ్యారు. భారత్‌కు పొట్టి ప్రపంచకప్‌ను అందించాలనే లక్ష్యంతో రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. ఇన్నాళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ప్రత్యర్థులుగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మనోళ్లు ఇప్పుడు ఒకటిగా కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇక ప్రపంచకప్ సాధించడమే తరువాయి..!
న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం అమెరికాలో అడుగుపెట్టిన టీమిండియా ప్రాక్టీస్‌ను షురూ చేసింది. రోహిత్ సారథ్యంలోని జట్టు బుధవారం కఠోర సాధన చేసింది. ఉదయమే ప్రారంభమైన ప్రాక్టీస్ సెషన్‌ను భారత ఆటగాళ్లు లైట్ జాగింగ్‌తో మొదలెట్టారు. ఆ తర్వాత షటిల్ రన్స్, ఫుట్ వ్యాలీలతో మధ్యాహ్నం వరకు తీవ్ర కసరత్తులు చేశారు. అనంతరం గ్రౌండ్‌లో కుకాబుర్రా బంతులతో ప్రాక్టీస్ కొనసాగించారు.
ఇక రెండు నెలల పాటు స్వదేశంలో ఐపీఎల్లో బిజీగా గడిపిన మన ఆటగాళ్లు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఔట్‌డోర్ సెషన్ ఏర్పాటు చేసినట్లు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ తెలిపారు. ‘భారత్‌తో పోలిస్తే ఇక్కడి ఉష్ణోగ్రతలు చాలా తక్కువ. పగటి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఇన్నాళ్లు 40 డిగ్రీలకు పైగా వేడిని భరించిన మన ఆటగాళ్లు ఇప్పుడు చల్లటి వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంది. అందుకే తొలుత అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఔట్‌డోర్ సెషన్ ప్రాక్టీస్‌ను నిర్వహించాం. రోహిత్ సేన ఎంతో ఉత్సాహంగా ఈ సెషన్‌లో పాల్గొంది’ అని సోహమ్ పేర్కొన్నాడు.
జట్టుతో కలవని కోహ్లీ
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మినహా 14 మంది ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో భారత్‌లోనే ఉండిపోయిన కోహ్లీ శుక్రవారం జట్టుతో కలిసే అవకాశముంది. జూన్ 1న బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీ ఆడడం అనుమానమే. దీంతో కోహ్లీ నేరుగా జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశముంది. ఇక తొలి రోజు ప్రాక్టీస్ సెషన్ అనంతరం భారత ఆటగాళ్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ‘న్యూయార్క్‌లో తొలిసారి క్రికెట్ ఆడబోతున్నాం. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కావడంతో ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాం. మాకు మంచి ఫన్ లభించే అవకాశముంది’ అని ఆల్‌రౌండర్ జడేజా అభిప్రాయపడ్డాడు.
‘అమెరికాలో క్రికెట్.. పాజిటివ్ వైబ్స్ కలిగిస్తుంది. ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంది’ అని వైస్ కెప్టెన్ పాండ్యా పేర్కొన్నాడు. ‘అమెరికాలో క్రికెట్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నట్లు తెలిసింది. తొలిరోజు మాలో మంచి ఉత్సాహం కనిపించింది. మ్యాచ్‌లు ఆడేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నాం’ అని సూర్యకుమార్ తెలిపాడు. 2007 తర్వాత టీమిండియా మరోసారి పొట్టి ప్రపంచకప్ గెలవలేదు. జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో ప్రపంచకప్ వేటను ప్రారంభించనున్న రోహిత్ సేన జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది.






