వేలానికి అరుదైన భారత నోట్లు
26-05-2024 02:13 AM
ఈ నెల 29న లండన్‌లో వేలం
న్యూఢిల్లీ, మే 25: భారతదేశానికి చెందిన రెండు అరుదైన నోట్లను లండన్‌లో వేలం వేయనున్నారు. 1918లో మద్యం, మందుగుండు సామగ్రి, ఇతర పదార్థాలతో బొంబాయి నుంచి లండన్‌కు బయలుదేరిన ఒక ఓడను జర్మన్ యూ బోటు మిస్సైల్ ఢీకొనడంతో నీట మునిగిపోయింది. ఐరీష్ తీరంలో సముద్రంలో మునిగిపోయిన ఆ ఓడలో ఉన్న రెండు రూ.10 నోట్లు ఇప్పుడు లండన్‌లో వేలానికి రానున్నాయి. ప్రపంచ బ్యాంక్ నోట్ల విక్రయంలో భాగంగా ఈ నెల 29న లండన్‌లోని నూనన్స్ మేఫెయిల్ వేలం హౌస్‌లో వీటిని వేలానికి ఉంచనున్నారు.
ఈ అరుదైన భారతీయ నోట్లు 2000 నుంచి 2600 పౌండ్ల వరకు పలకవచ్చని అంచనా. 1918 మే 25న జారీ చేసిన ఈ నోట్లు జూలై 2న ధ్వంసమైన ఎస్‌ఎస్ షిరాలా అనే ఓడలో లభించాయి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సోషల్ మీడియాలో 1918 నాటి నౌకా ప్రమాదంలో లభించిన నోట్లుగా పేర్కొనడంతో ఇవి అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇవికాకుండా మరో రూ.100 నోటు కూడా ఈ వేలంలో ఉందని, ఇది బ్రిటీష్ వలస కాలానికి చెందినదని సంబంధిత అధికారులు చెప్పారు. ఈ నోటు కోల్‌కతాలో స్టాంప్ వేయబడింది.






