నదిలోకి తీసుకెళ్లిన గూగుల్ మ్యాప్
న్యూఢిల్లీ, మే 25: ప్రస్తుతం ఎవరైనా సుదూర ప్రాంతంలోని గమ్యస్థానాలు చేరుకునేందుకు గూగుల్ మ్యాప్‌ను వినియోగిస్తున్నారు. జీపీఎస్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్షన్‌లో లోపాల కారణంగా కొంతమంది ప్రయాణికులు దారి తప్పుతున్నారు. కొందరు ప్రమాదాల బారిన పడుతుండగా, ఇంకొందరు అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడుతున్నారు. తాజాగా కేరళలో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు పర్యాటకులు శుక్రవారం కేరళకు చేరుకున్నారు. గూగుల్ మ్యాప్ సాయం తో కారులో అలప్పుళ బయల్దేరారు.
మార్గమధ్యంలోని కురుప్పంతార చేరుకోగానే డ్రైవర్ మ్యాప్ చూపించిన వైపు కారును నడిపాడు. కారు నేరుగా నీటి ప్రవాహంలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నలుగురు పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రాణనష్టం సంభవించలేదు. కారు మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.






