దండకారణ్యంలో తుపాకుల మోత
- ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్’
తాజాగా జవాన్లు, భద్రతా బలగాల మధ్య కాల్పులు
8 మంది మావోయిస్టులతో పాటు ఓ జవాన్ మృతి
మరో ఇద్దరు మావోయిస్టులకు గాయాలు
న్యూఢిల్లీ, జూన్ 15: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ‘ఆపరేషన్ కగార్’ను అమలు చేస్తోంది. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెడుతున్నది. భద్ర తా బలగాలు దండకారణ్యంపై డేగ కన్ను వేసి మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో నారాయణపూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున పోలీసులు, మావో యిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఎనిమిది మావోయిస్టులు మృతిచెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఇవే కాల్పుల్లో ఓ జవాన్ కూడా తీవ్రంగా గాయపడి మృతిచెందాడు.
పోలీస్‌శాఖ అదనపు డైరెక్టర్ (నక్సల్స్ ఆపరేషన్స్) వివేకానంద సిన్హా వెల్లడించిన వివరాల ప్రకారం.. నారాయణపూర్, కాంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలు అబుజ్‌మడ్ అటవీప్రాంతంలో యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మావోయి స్టులు తారసపడి కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమన జవాన్లు ఎదురుదాడికి దిగారు.
ఇరువైపులా కొన్ని నిమిషాల పాటు భీకర పోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీప్రాంతంలోకి పరారయ్యారు. అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఓ జవాన్ మృతదేహాన్ని గుర్తించారు. గాయపడిన మరో ఇద్దరు మావోయిస్టు క్షతగాత్రులను గుర్తించి, వారిని సమీపంలోని ఆస్పత్రికి అందించి చికిత్స చేయిస్తున్నారు.






