హోర్ముజ్ వద్దే 18 భారత నౌకలు!
- భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ ప్రీమియం
- రప్పించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలు
- 485 మంది నావికులు సురక్షితం
టెహ్రాన్, మార్చి 31 (విజయక్రాంతి): పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఆయా దేశాల్లో టెన్షన్ నెలకొంది. తమ మిత్రదేశాలు మాత్రమే ఈ జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతించామని ఇరాన్ చెబుతున్నప్పటికీ, ఇతరదేశాల నుంచి భారత్‌కు వస్తున్న ఇంధన, ఎల్పీజీ నౌకలను అడ్డుకోవడం ఆందోళన కలిగిస్తుంది.
హోర్ముజ్ చుట్టుపక్కల ప్రస్తుతం భారత్‌కు వస్తున్న 10 విదేశీ జెండానౌకలు, 18 భారత జెండానౌకలు నిలిచిపోయాయి. ఈ నౌకల్లో ఎల్పీజీ, ఎల్‌ఎస్‌జీ, ముడిచమురు భారత్‌కు రావాల్సి ఉంది. ఈ నౌకల్లో ఉన్న 485 మంది భారత నావికులు క్షేమంగా ఉన్నారు. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల్లో యుద్ధం కారణంగా హోర్ముజ్ గుండా వెళ్లే నౌకలపై తీవ్ర ప్రభావం పడింది.
ప్రపంచంలో ఐదోవంతు ఈ మార్గం గుండానే ముడిచమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరా అవుతుంది. భారీ నౌకలు సముద్రంలో నిలిచిపోవడంతో ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందు 0.4 శాతం మాత్రమే ఉన్న ప్రీమియం కాస్త ఇప్పుడు 0.7 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 8 భారత నౌకలు సురక్షితంగా హోర్ముజ్ నుంచి రాగా, మిగతావి అక్కడే ఉన్నాయి.




