గ్యాప్ అప్ ఓపెనింగ్
నేటి మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల అంచనాలు
గత 10 ట్రేడింగ్ రోజుల్లో ఎన్నికల టెన్షన్‌తో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ మార్కెట్‌కు ఎగ్జిట్ పోల్స్‌తో ఈ సోమవారం ఊరట లభిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయప డుతున్నారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్‌డీఏ కూటమి 350పైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించవచ్చని వెల్లడించాయి. దీనికి తోడు భారత్ జీడీపీ క్యూ4లో అంచనాల్ని మించి 7.8 శాతం వృద్ధిచెందినట్టు శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన డేటా, యూఎస్ ప్రధాన ద్రవ్యోల్బ ణం మే నెలలో స్థిరంగా ఉందంటూ వెల్లడైన గణాంకాల కారణంగా ఈ వారం స్టాక్ సూచీలు భారీ గ్యాప్ అప్‌తో ప్రారంభమవుతాయని అంటున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 2 : ‘సోమవారం ఉదయం మార్కెట్లు ఎగ్జిట్‌పోల్స్ నంబర్లను సెలబ్రేట్ చేసుకుంటాయి. పెద్ద గ్యాప్ అప్‌తో మొదలువుతాయి. నిఫ్టీ కొత్త రికార్డుస్థాయికి పరుగులు తీసే ఛాన్స్ ఉన్నది’ అంటూ మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. దుబాయ్ కేంద్రం గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాల్మా క్యాపిటల్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ గ్యారీ డుగాన్ బ్లూంబర్గ్ ప్రతినిధితో మాట్లాడుతూ సోమవారం భారత్ మార్కెట్ నుంచి 3 శాతం లాభాన్ని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. మంచి మెజారిటీతో ప్రభు త్వం ఏర్పడితే ప్రస్తుత ఆర్థిక విధానాలు కొనసాగుతాయన్న అంచనాల కారణంగా సోమవారం భారీ ర్యాలీ జరుగుతుందన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు మెజారిటీ తగ్గుతుందన్న భయాలు ఏర్పడటంతో గత కొద్దివారాలుగా స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన సంగతి తెలిసిందే. గత గురువారం వరకూ వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్ క్షీణతను చవిచూసింది. గతవారం మొత్తం మీద సెన్సెక్స్ 1,449 పాయింట్లు క్షీణించి 73,961 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ 426 పాయింట్లు నష్టపోయి 22,530 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వారాంతంలో ట్రేడర్లు ఎగ్జిట్‌పోల్స్, ఎన్నికల తుది ఫలితాల పట్ల వారి అంచనాలకు అనుగుణంగా పొజిషన్లను సర్దుబాటు చేసుకున్నారు.
నేడు ర్యాలీ ఎంతవరకూ?
సోమవారం జూన్ 3న నిఫ్టీ గ్యాప్‌అప్‌తో ఆరంభమై 23,000 శ్రేణివైపు కదలవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఇండెక్స్ 22,400 పాయింట్ల స్థాయిని నిలుపుకుంటుందని భావిస్తున్నారు. తదుపరి రోజుల్లో క్రమేపీ అప్‌ట్రెండ్ సాగించవచ్చని వారు చెపుతూ ఈ వారం రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య విధాన సమీక్ష ఉన్నందున మార్కెట్ కొంత ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చని అంటున్నారు. ఇన్వెస్టర్లు వారి స్వల్పకాలిక పొజిషన్లను జాగ్రత్తగా గమనించుకోవాలని, హెడ్జ్ చేసుకోవాలని నిపుణులు సూచించారు. జూన్ 5 తేదీల మధ్య ఆర్బీఐ ద్రవ్య విధాన పరపతి విధాన సమీక్ష జరగనుంది. ‘ఎగ్జిట్ పోల్స్ బుల్స్ కదం తొక్కడానికి అవకాశం కల్పించాయి. సోమవారం మార్కెట్ పెద్ద ర్యాలీ జరుపుతుంది. ఫైనాన్షియల్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్, టెలికం రంగాల్లోని లార్జ్‌క్యాప్ షేర్లు ర్యాలీకి నేతృత్వం వహిస్తాయి.
2023 జీడీపీ 8.2 శాతం వృద్ధిచెందినట్టు వెలువడిన డేటా బుల్స్‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. సాంకేతికంగా, ఫండమెంటల్స్‌పరంగా పెద్ద ర్యాలీ జరపడానికి మార్కెట్ సంసిద్ధంగా ఉంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్, వీకే విజయకుమార్ చెప్పారు. కానీ టెక్నికల్‌గా చూస్తే వొలటాలిటీ ఇండెక్స్ గరిష్ఠస్థాయిలో 24 వద్ద ఉన్నందున, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు లోనయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రశాంత్ తాప్సే హెచ్చరించారు. మార్కెట్లు 22,400పైన నిలిస్తే 22,800 శ్రేణిని వచ్చే కొద్ది రోజుల్లో అందుకోవచ్చని, ఇటీవలి రికార్డు గరిష్ఠస్థాయి 23,110 పాయింట్ల ఎగువన నిఫ్టీ ముగుస్తుందా? లేదా అన్నది తదుపరి అప్‌ట్రెండ్‌కు కీలక సాంకేతిక అంశమని తాప్సే వివరించారు.
ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగానే ఫలితాలు వస్తే..
శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కొత్త రికార్దుస్థాయిని అందుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు వారి షార్ట్ పొజిషన్లను వేగం గా కవర్ చేసుకుంటారని, దీంతో తక్షణ ర్యాలీ జరుగుతుందని పైపర్ సెరికా అడ్వయిజర్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ అభయ్ అగర్వాల్ తెలిపారు. షార్ట్ పొజిషన్లపై వచ్చే మార్జిన్ కాల్స్ కారణంగా సోమవారమే 23,000 పాయింట్ల ఎగువకు దూసుకుపోవచ్చని, అధికార ఎన్‌డీఏకు 350 స్థానాలకు పైగా లభిస్తే జూన్ 4న 23,500 పాయింట్ల రికార్డుస్థాయికి పెరగవచ్చని అంచనా వేశారు.
ఎన్నికల ఫలితాలు తర్వాత?
సోమవారం ఎగ్జిట్ పోల్స్‌కు స్పందించిన అనంతరం మంగళవారం వెలువడే ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా లాంగ్ ఆఫ్‌లోడింగ్ లేదా షార్ట్ కవరింగ్ కార్యకలాపాలతో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అపై కొత్త కేబినెట్‌తో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సమర్పించబోయే పూర్తిస్థాయి బడ్జెట్‌వైపు మార్కెట్ దృష్టి మళ్లుతుందని మెహతా ఈక్విటీస్ ప్రశాంత్ తాప్సే చెప్పారు.
ఇన్వెస్టర్లు ఈ దశలో వచ్చే 2 రోజుల లాభాలకంటే రానున్న ఐదేండ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు చేయాలని, ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ మూలధన వ్యయం, మార్కెట్ విలువ, కార్పొరేట్ల లాభాల వృద్ధి..భవిష్యత్ రాబడులకు కీలకమని తాప్సే సూచించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు వచ్చే 100 రోజులూ జాగ్రత్తగా గమనించాలని, కేవలం గత ఆరు నెలల్లో మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్ల మేర పెరిగిందని, ఇదే తరహా మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదా అనేది కీలకమని అన్నారు. పీఎస్‌యూ, విద్యుత్, డిఫెన్స్, రైల్వేస్, ఇతర కేపెక్స్ ఆధారిత రంగాలను పెట్టుబడికి ఎంచుకోవచ్చని సిఫార్సు చేశారు.






