రెండు రెట్లు పెరిగిన ఏసీల అమ్మకాలు
ముంబై, జూన్ 2: దేశంలో నెలకొన్న తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా మే నెలలో ఎయిర్ కండీషనర్ల విక్రయాలు రెండు రెట్లు పెరిగాయి. ఏసీ తయారీ కంపెనీలు వోల్టాస్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, బ్లూస్టార్, దైకిన్ ఇండియా, పానాసోనిక్ తదితరాలన్నీ మేలో భారీ అమ్మకాల్ని సాధించా యి. 2024 సంవత్సరం మొత్తంమీద 30 శాతం వృద్ధి ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నది. మే నెలలో వోల్టాస్ రెసిడెన్షియల్ ఏసీల విక్రయా లు రెండు రెట్లు పెరిగాయని, ఏప్రిల్ పూర్తి త్రైమాసికంలో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో ప్రదీప్ భక్షి తెలిపారు. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ఏసీ విక్రయాల్లో 20 లక్షల యూనిట్ల మార్క్ ను చేరతామని ఈ టాటా గ్రూప్ కంపెనీ అంచనా వేస్తున్నది. డిమాండ్ ఎన్నో రెట్లు పెరగడంతో గత ఐదేండ్ల రికార్డుల్ని ఏసీల వ్యాపారంలో అధిగమించినట్టు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీనియర్ వీపీ సంజయ్ చిత్కారా చెప్పారు. ఏప్రిల్‌లోనే డిమాండ్ ఆకాశన్నంటిందని, దీంతో మే నెలలో నెమ్మదిస్తుందని తాము అంచనా వేశామని, కానీ ఉత్తరాదిన అమ్మకాలు భారీగా పెరిగినట్టు బ్లూస్టార్ ఎండీ త్యాగరాజన్ చెప్పారు.






