మూత్రం రంగు మారిందా? జాగ్రత్త!
మనం ఆరోగ్యంగా ఉన్నమా లేదా అనేది శరీరంలో కనిపించే లక్షణాల సహాయంతో అంచనా వేయొచ్చు. మీకు తెలుసా... మన ఆరోగ్యం ఎలా ఉందో మన మూత్రం చెబుతుంది. మూత్రం రంగు ఆధారంగా శరీరంలో ఉన్న సమస్యలను గుర్తించవచ్చు. అయితే చాలా మంది దీనిని తెలిసి లేదా తెలియక నిర్లక్ష్యం చేస్తారు. ఇది చాలా ప్రమాదమని డాక్టర్లు అంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో మూత్రంలో కని పించే మార్పులపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.. అసలు ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకుంటే దానికి తగినట్లు జాగ్రత్తలు తీసుకోవచ్చు. మూత్రం పసుపు రంగులోకి ఎందుకు మారుతుందో తెలుసుకుందాం.
మారడానికి కారణాలు..
కొన్ని రకాల ఆహార పదార్థాలు, సప్లిమెంట్ల వల్ల మూత్రం రంగు మారవచ్చు. ఒకవేళ మీరు విటమిన్ బీ మాత్రలు వేసుకుంటే లేదా క్యారెట్లు ఎక్కువగా తిన్నా మీ మూత్రం పసుపు రంగులోకి మారవచ్చు. అంతేకాకుండా ఎర్ర రక్త కణాల నుంచి హిమోగ్లోబిన్ క్షీణించడం వల్ల వచ్చే యూరోబిలిన్ మూత్రం పసుపు రంగులోకి మారడానికి కారణం అవుతుంది. బాగా హైడ్రేటెడ్ వ్యక్తి మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. అయితే, డీహైడ్రేట్ అయినప్పుడు మాత్రం మూత్రం ముదురు పసుపు లేదా ముదురు రంగులోకి మారుతుంది. కాలేయం, మూత్ర పిండాల వ్యాధుల కారణంగా మూత్రం రంగు కూడా మారవచ్చు. కామెర్లు వచ్చినప్పుడు మూత్రం పసుపు నుంచి గోధుమ రంగులోకి మారవచ్చు. ఇది బిలిరుబిన్ స్థాయిలు పెరగడం వల్ల వస్తుంది.
అజాగ్రత్త వద్దు..
మూత్రం పసుపు రంగులో రావడం అనేది సాధారణమే. అయినప్పటికీ, ఇది ప్రత్యేకంగా ముదురు రంగులో ఉంటే.. నొప్పి లేదా ఎక్కువగా వాసన వస్తుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.






