నాడు భూదానం.. నేడు భూదాహం
(ఏప్రిల్ 18న భూదాన్ ఉద్యమం ప్రారంభమైన సందర్భంగా)
1951 ఏప్రిల్ 18న ఆచార్య వినోబా భావే తెలంగాణలో భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు భూమి అనేది సామాజిక న్యాయ సాధనంగా మారింది. పేదలకు భూమి అందించాలని, సమాజంలో సమానత్వం రావాలని ఆశించిన ఆ ఉద్యమం, ఒక నైతిక విప్లవానికి నాంది పలికింది. భూస్వాములు స్వచ్ఛందంగా తమ భూమిని పంచుకోవడం అప్పటి విలువల ప్రతిబింబం. కానీ, అదే భూమి నేడు విపరీతమైన భూదాహానికి కారణమైంది.
అప్పట్లో భూమి పంచుకున్న సమాజం, ఇప్పుడు భూమిని కబ్జా చేసే సమాజంగా మారిపోయింది. ఒకప్పుడు బలవంతంగా ఆక్రమణలు జరిగితే, ఇప్పుడు చట్టాల ముసుగులోనే కబ్జాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నగర పరిసర ప్రాంతాల్లో, విలువ పెరిగే భూములను టార్గెట్ చేస్తూ కబ్జాదారులు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. మొదటిది, నకిలీ పత్రాల ద్వారా భూ ఆక్రమణలు జరుగుతున్నాయి.
అసలు యజమానులకు తెలియకుండానే, వారి భూములకు ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసి ఇతరులకు విక్రయిస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు తీరని నష్టం జరుగుతోంది. రెండవది, ప్రభుత్వ భూముల ఆక్రమణలు. చెరువులు, గుంటలు, పచ్చబయళ్లను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ఇది పర్యావరణానికి శాపంగా మారింది. మూడవది, రాజకీయ నేతలు, వ్యాపారులు కుమ్మక్కై భూముల విలువ పెరిగే ప్రాంతాల్లో పేదలను బెదిరించి పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసి, తరువాత అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
నాలుగవ ది, పరిశ్రమలు, అభివృద్ధి పేరిట సరైన పరిహారం ఇవ్వకుండానే రైతుల భూములను లాక్కుంటున్నారు. ఈ పరిస్థితుల్లో, భూమి ఒక ఆస్తి మాత్రమే కాకుండా, అధికారానికి ప్రతీకగా మారింది. మనం నిజంగా అభివృద్ధి దిశగా వెళ్తున్నామా? లేక విలువల పతనం దిశగా సాగుతున్నామా? అని ప్రశ్నించుకోవాలి. భూదాహం సమాజంలో అసమానతలను మరింత పెంచుతోంది.
ఈ సమస్య కేవలం చట్టాలతో పరిష్కారం కాదు. పారదర్శక భూ రికార్డులు, డిజిటలైజేషన్, కఠినమైన శిక్షలు అవసరం. మొత్తానికి, ‘నాడు భూదానం’ మనసులను కలిపితే, ‘నేడు భూదాహం’ మనషులను విభజిస్తున్నది. దీన్ని మార్చాలంటే వినోబా భావే చూపిన మార్గాన్ని తిరిగి ఆచరణలో పెట్టాలి.
ఎల్లబోయిన వెంకటేశ్వర్లు, 8184940814






