10 July, 2026 | 3:19 AM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

10-07-2026 02:19 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, జూలై 9 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇంట్లో అందరికీ ఇవ్వడం జరుగుతుందని అర్హత ఒక్కటే ప్రమాణం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగర పరిధిలోని జైనల్లీపూర్, తువ్వగడ్డ తాండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే హాజరై ప్రారంభించి, లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల కలగానే కాకుండా వాస్తవం కావాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదల జీవన స్థాయి మెరుగుపడుతుందని, అర్హులందరికీ పారదర్శకంగా ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నాయకులు చంద్ర నాయక్, మంగ్యా నాయక్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.