10 July, 2026 | 3:19 AM

రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

10-07-2026 02:19 AM

రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ 

మెదక్, జులై 9 (విజయ క్రాంతి) :భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించి ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే, నక్ష భూముల అంశాలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మెదక్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం  నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఏడి ల్యాండ్ సర్వే కిషన్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను దశలవారీగా చేపడుతోందని తెలిపారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సర్వేతో ప్రతి సర్వే నంబర్కు స్పష్టమైన యాజమాన్య హక్కులు నిర్ధారించడంతో పాటు ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ యూనిక్ నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు.

డీజీపీఎస్ (GPS), రోవర్స్, జీఐఎస్ (GIS) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రీ సర్వే చేపట్టాలని ఆదేశించారు. రీ సర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, ఆయా గ్రామసభల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వాములను చేయాలని సూచించారు. రీ సర్వేలో రెగ్యులర్ సర్వేయర్లతో పాటు లైసెనస్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

సోమవారం నుంచి సర్వేయర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందికి బ్యాచ్ల వారీగా సమగ్ర శిక్షణ నిర్వహించి అనంతరం అన్ని గ్రామాల్లో రీ సర్వే కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రీ సర్వే పూర్తయ్యే వరకు రెగ్యులర్ సర్వేయర్లలో 25 శాతం మందిని రొటేషన్ పద్ధతిలో విధుల్లో వినియోగించాలని తెలిపారు.

లైసెనస్డ్ సర్వేయర్ల పనితీరును శాఖ సర్వేయర్లు నిరంతరం పర్యవేక్షించాలని, డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.  ప్రస్తుతం ప్రతి అధికారి వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై హైకోర్టు  వివరణ కోరుతోందని, స్పందించేందుకు నాలుగు వారాల గడువు లభించిందన్నారు. రెవెన్యూ కార్యాలయంలోనూ భూ భారతి దరఖాస్తులు 60 రోజులకు మించి పెండింగ్లో ఉండకూడదని, పెండింగ్ దరఖాస్తులను అత్యంత త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ వీసీ లో సంబంధిత అధికారులు  పాల్గొన్నారు