ఇందిరమ్మ ఇల్లు.. కలగానే!
నాడు మంజూరైనా బిల్లు రాలేదు.. నేడు కొత్తగా మంజూరూ కాలేదు
వానొస్తే వలవల.. గాలి వీస్తే గలగల
సెంటు భూమి లేదు.. కూలి పనులతో కుటుంబ పోషణ
శిథిలావస్థలో గూడు.. ఆదుకోవాలని బుడిగమల్ల కలమ్మ పరిపూర్ణ వేడుకోలు
అచ్చంపేట,(విజయ క్రాంతి): పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం తమకు మాత్రం అందని ద్రాక్షగా మారిందని నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం బి.కె. తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బుడిగమల్ల కలమ్మ పరిపూర్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ అందుకు సంబంధించిన బిల్లు తమకు అందలేదని, ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నా తమ కుటుంబానికి ఇల్లు మంజూరు కాలేదని ఆమె వాపోయారు.
నాడు మంజూరు.. నిధులు మాత్రం రాలేదు
గతంలో తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, అయితే ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లు అందకపోవడంతో ఆ పథకం ప్రయోజనం తమకు పూర్తిగా దక్కలేదని కలమ్మ పరిపూర్ణ తెలిపారు. ప్రస్తుతం మరోసారి ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నప్పటికీ తమ కుటుంబాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.
సెంటు భూమి లేదు.. కూలి పనులే ఆధారం
తమకు సొంతంగా కనీసం సెంటు భూమి కూడా లేదని ఆమె తెలిపారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, వచ్చే ఆదాయంతోనే నిత్యావసరాలు తీర్చుకోవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సొంతంగా ఇల్లు నిర్మించుకోవడం తమకు సాధ్యం కాదన్నారు.
వానొస్తే వలవల.. గాలి వీస్తే గలగల
ప్రస్తుతం నివాసం ఉంటున్న గూడు శిథిలావస్థకు చేరిందని కలమ్మ పరిపూర్ణ తెలిపారు. వర్షం పడితే ఇంట్లోకి నీరు చేరుతోందని, గాలి వీస్తే పైకప్పు, గోడలు ఎప్పుడు కూలిపోతాయోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని చెప్పారు. కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి.
తమ కుటుంబ పరిస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలమ్మ పరిపూర్ణ కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము అర్హులైతే వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, సొంతింటి కలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. “మాకు గూడు లేదు.. సొంత భూమి లేదు.. కూలి పని చేస్తేనే పూట గడుస్తుంది. శిథిలమైన ఇంట్లో భయంతో బతుకుతున్నాం. ప్రభుత్వం మా పరిస్థితిని చూసి ఆదుకోవాలి” అని కలమ్మ పరిపూర్ణ వేడుకుంటున్నారు.






