31 July, 2026 | 12:37 AM

రైతు భరోసా అర్హుల గుర్తింపు

24-06-2024 12:10 AM
  1. బీడు, వెంచర్లు, రోడ్లు జాబితా నుంచి తొలగింపు
  2. రెండు రోజులుగా గ్రామాల్లో అధికారుల పరిశీలన
  3. గతంలో రూ.18 వేల కోట్లు అనర్హులకు అందినట్లు వెల్లడి
  4. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గైడ్‌లైన్స్ రైతు భరోసాకు అమలు 

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): రైతు భరోసాకు నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అర్హులకే అందించాలని బీడు భూ ములు, వెంచర్లు , రహదారులు, రాళ్లు రప్పలు కలిగిన భూములను గుర్తించి వాటిని రైతు భరోసా జాబితా నుంచి తొలగించేందుకు వ్యవసాయశాఖ గత రెండు రోజుల నుంచి కసరత్తు చేస్తోంది. గత మూడేళ్ల నుంచి సాగు చేయని రైతులపై సమీప రైతులు ఫిర్యాదుల చేశా రు.

వీటిని పరిగణలోకి తీసుకుని అనర్హులను స్థానిక అధికారులు గుర్తిస్తున్నారు. అదే విధంగా ధరణి వచ్చిన ప్పుడు చాలా మంది రైతులకు ఉన్న భూమికంటే అదనంగా నమోదు కావడంతో సర్వే నెంబర్‌లో భూమి విస్తీర్ణం గతం కంటే ఎక్కువగా పెరగడంతో అధికారులు గుర్తిస్తూ సరిచేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో  పూర్వీకులకు సంబంధించిన భూములు ఉండటంతో వారి వారసులకు పాస్‌బుక్‌లు ఇచ్చారు. కానీ వారు ఆధార్ నమోదు చేసుకోలేదు. ప్రస్తుతం వారి వివరాలు సేకరిస్తూ అందుబాటులో లేని వారిని కూడా జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం ద్వారా వేల కోట్లు ప్రజా వృథా అయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

2018 మధ్య వానకాలం వరకు 11 విడు తల్లో సుమారు రూ.72,910 కోట్లను రైతు బంధు పథ కం కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో సుమారు రూ. 18 వేల కోట్లు అనర్హులకు, సాగులేని భూ ముల రైతుల ఖాతాలో జమ అయినట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తుంది. 20 ఎకరాలపై బడిన రైతులకు ఏకంగా రూ. 5 వేలకోట్లు పెట్టుబడి సాయం కింద అందినట్లు సమాచారం. అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సైతం ఉన్నట్లు తెలిసింది. రైతుబంధు ద్వారా ఎంత మంది అనర్హులు లబ్ధిపొందారు, ఎంత మొత్తంలో ప్రజాధనం వృథా అయిందనే కోణంలో లెక్కలు తీస్తున్న ప్రభుత్వం త్వరలోనే ఆ వివరాలు బహిరంగపరచాలని భావిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిపింది. 

పీఎం కిసాన్ గైడ్‌లైన్స్ అమలు

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులకు అందించేందుకు సిద్ధమైంది. ఏకపక్షంగా విధివిధానాలను తయారు చేయకుండా రైతులు, నిపుణులు, రాజకీయ పార్టీ అభిప్రాయాలను తీసుకునేందుకు రెడీ అవుతుంది. రైతు భరోసా పథకం కింద కేవలం సాగు భూములకు, అందులో  నిజమైన రైతులకు మాత్రమే ప్రయోజనం పొందేలా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గైడ్ లైన్స్‌ను రైతు భరోసాకు అమలు చేయాలని భావిస్తోంది. దీంతో ఐటీ చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయం కట్ అవుతుంది.