ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలి
నూతనకల్ , మార్చి 2:ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా చూడాలని, అలాగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ శ్రీనివాసరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, జిపిఓలు, బిఎల్‌ఓలు మరియు సూపర్వైజర్లతో ఆయన వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ప్రభుత్వం మన ఇసుక వాహనం ద్వారా సరఫరా చేస్తోందని, లబ్ధిదారులు ఆన్లైన్లో నమోదు చేసుకునేలా చూడాలని పంచాయతీ సెక్రటరీలు, జిపిఓలకు సూచించారు.అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి ఇసుక అందేలా క్షేత్రస్థాయిలో సహకరించాలని స్పష్టం చేశారు.అనంతరం బిఎల్‌ఓలు, సూపర్వైజర్లతో జరిగిన సమావేశంలో మాట్లా డుతూ ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
జాబితాలో ఫోటోలు సరిగ్గా లేని వారిని, అస్పష్టంగా ఉన్న వారిని గుర్తించి వెంటనే సవరణలు చేయా లని, తద్వారా ఓటర్ల జాబితాలో లోపాలు లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సునిత, ఆర్‌ఐ హస్సన్, మండల స్థాయి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




