ఓఆర్‌ఆర్ అవతలికి పరిశ్రమలు
- హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతాం
- ఓఆర్‌ఆర్ బయటే పెరి అర్బన్ రీజియన్ ఏర్పాటు
- ‘మాన్యుఫాక్చరింగ్ జోన్’గా గుర్తించి, పరిశ్రమలకు స్థలాలు
- ఈ జోన్‌లో ‘ప్రీమియర్ ఎనర్జీస్’ పరిశ్రమ మొదటిది
- అధికారానికి దూరమయ్యామని బీఆర్‌ఎస్ విషం కక్కుతోంది
- ‘ప్రీమియర్ ఎనర్జీస్’ సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
- రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో ఏర్పాటు
- 3 వేల మంది స్థానిక యువతకు ఉపాధి: మంత్రి శ్రీధర్‌బాబు
రంగారెడ్డి/చేవెళ్ల, జూలై 9 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలికి తరలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్ బయటే పెరి అర్బన్ రీజియన్ ఏర్పాటు చేసి, ‘మాన్యుఫాక్చరింగ్ జోన్’గా గుర్తిస్తామని, పరిశ్రమలకు అక్కడే స్థలాలు కేటాయిస్తామని వెల్లడించారు.
గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం సీతారాంపూర్‌లో 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను (5.6 జీబీ సామర్థ్యం) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి సీఎం ప్రారంభించారు. సోలార్ ప్యానెల్స్‌తో పాటు రూ.వేల కోట్లతో అనుబంధంగా నిర్మించ తలపెట్టిన 6 జి డబ్ల్యూహె బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బెస్), అల్యూమినియం ఫ్రేమ్స్ తయారీ యూనిట్లకు భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అంతర్భాగం మొత్తాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్ను వంటి మెట్రోపాలిటన్ నగరాలు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే నేడు తీవ్ర కాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్నాయని, వాటి నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని జీడిమెట్ల, బాలానగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో వస్తున్న కాలుష్యం, దానికి తోడు మూసీ నది కాలుష్యంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు తరలించడానికి చట్టం తెచ్చామని, బయట ఉన్న పెరి అర్బన్ రీజియన్‌ను ‘మాన్యుఫాక్చరింగ్ జోన్’గా గుర్తించి, తరలివచ్చే పరిశ్రమలకు అక్కడే స్థలాలు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ జోన్‌లో ప్రారంభమైన మొట్టమొదటి పరిశ్రమ ‘ప్రీమియర్ ఎనర్జీస్’ కావడం విశేషమన్నారు. కేవలం 12 నెలల రికార్డు కాలంలో ప్లాంట్ పూర్తి చేసిన యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్
2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది, దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌తో ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు. ప్రపంచంతో పోటీ పడాలంటే మరిన్ని పెట్టుబడులు రావాలన్నారు. యువతకు బ్లూకాలర్ ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచేందుకు ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రకృతిని విధ్వంసం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన సీఎం.. సోలార్ ఎనర్జీతో నడిచే ‘ఆక్సీట్రీ’ (ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్) ఉత్పత్తులను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు తమకు అధికారమిచ్చారని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అధికారానికి దూరమయ్యామన్న అక్కసుతో ప్రజలపై విషం కక్కడం సరికాదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
స్థానిక యువతకే పెద్దపీట: మంత్రి శ్రీధర్‌బాబు
పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. క్లీన్ ఎనర్జీ (హరిత ఇంధన) రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ సరికొత్త ప్లాంట్ ద్వారా స్థానిక పరిసర ప్రాంతాలకు చెందిన 3,000 మందికి పైగా నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు.
దేశంలోనే మొదటిసారిగా ‘జీరో బస్ బార్’ మాడ్యూల్ తయారీ లైన్లు, ఏఐ ఆధారిత క్వాలిటీ ఇన్స్‌ఫెక్షన్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారని, ఇక్కడ ప్రతి 4 సెకన్లకు ఒక సోలార్ మాడ్యూల్ తయారవుతుందని చెప్పారు. పెట్టుబడిదారులకు ‘టీజీఐపాస్’ సింగిల్ విండో ద్వారా వేగంగా అనుమతులు అందిస్తున్నామని, పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.
కార్యక్రమంలో మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాద య్య, మనోహర్ రెడ్డి, టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి, ప్రీమియర్ ఎనర్జీస్ చైర్మన్ సురేందర్ పాల్ సింగ్ సలూజా, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సింగ్ సలూజా, ప్రభుత్వ ఉన్నతాధికారు లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






