10 July, 2026 | 1:52 AM

నాగన్న పాట విశ్వవ్యాప్తం

10-07-2026 12:00 AM
  1. కవులు, కళాకారుల పుట్టినిల్లు తెలంగాణ 
  2. మాట, పాటతోనే ప్రశ్నించే తత్వం 
  3. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది కవులు, కళాకారులు, రచయితలు, మేధావులకు జన్మనిచ్చిన గడ్డ అని తెలంగాణ గడ్డమీద పుట్టిన బిడ్డ అరుణోదయ నాగన్న అని, నాగన్న జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఖమ్మంలో గురువారం అరుణోదయ సాంస్కృతిక సేనాని నాగన్న నివాసానికి వెళ్లి, నాగన్న చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంతోమంది కవులు కళాకారులు అనేక త్యాగాలకు ఓర్చి తమ మాట ద్వారా పాట ద్వారా ప్రజా ఉద్యమాలను నిర్మించాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే త్యాగాల దారిలో నాగన్న జీవితం పయనించిందని, తన గొంతు నుండి జాలువారిన వేలాది పాటలతో లక్షలాది మంది సామాజిక స్ఫూర్తి పొందారని చెప్పారు. నాగన్న పాట నేడు విశ్వవ్యాప్తం చెందిందని, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు.

పాట బతికినంత కాలం నాగన్న కోట్లాదిమంది ప్రజల హృదయాలలో జీవించే ఉంటారని ఆయన తెలిపారు. ఆయనవెంట గోపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న, అమరగాని వెంకన్న గౌడ్, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మాచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్,  సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మార్క లింగయ్య గౌడ్, జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షులు వెంకటాచారి, గోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిద శ్రీనివాస్ గౌడ్, బెల్లంకొండ శరత్, ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుక్కల నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.