22 August, 2026 | 12:32 PM

వైద్యుల నిర్లక్ష్యం.. కామారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి

22-08-2026 11:26 AM

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో(Kamareddy District Government Hospital) శిశువు మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రసవం కోసం నిన్న ఆస్పత్రిలో చేరిన ఎక్కపల్లి తండాకు చెందిన గర్భిణికి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉందని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సర్జరీకి నిరాకరించినట్లు వారు ఆరోపించారు. అయితే నార్మల్ డెలివరీ కాకపోవడంతో ఇవాళ గర్భిణికి ఆపరేషన్ నిర్వహించగా, అప్పటికే శిశువు కడుపులోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని గర్భిణి బంధువులు ఆరోపిస్తున్నారు. సకాలంలో ఆపరేషన్ చేయకుండా గర్భిణిని రెండు రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.