22 August, 2026 | 12:55 PM

ముదురుతున్న వనపర్తి కాంగ్రెస్ వార్

22-08-2026 11:51 AM

ఢిల్లీ, గాంధీభవన్ కు వనపర్తి కాంగ్రెస్ వార్

నేతల మధ్య పంచాయితీ క్లైమాక్స్ వచ్చే ఛాన్స్

వివరణ ఇచ్చేందుకు నేడే చివరి రోజు

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ, సీఎంపై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ వనపర్తి వార్ ఢిల్లీకి, గాంధీభవన్ కి మధ్య హాట్ టాపిక్ గా మారింది. వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ(Telangana Congress) చిన్నారెడ్డిని వివరణ అడిగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి గాంధీభవన్ పెద్దలతో పాటు ఢిల్లీలోని AICC ఫిర్యాదు చేశారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కలిసి చిన్నారెడ్డి తీరుపై ఫిర్యాదు చేశారు.

శనివారం నాడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), కేసీ వేణుగోపాల్ తోనూ మేఘారెడ్డి భేటీ కానున్నారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సింగిల్ పాయింట్ ఎజెండాతో మేఘా రెడ్డి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్నారెడ్డి కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘానికి నేడు వివరణ ఇవ్వనున్నారు. అనుచిత వ్యాఖ్యల్లో మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి చిక్కుకోవడం రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

వివాదాల్లో చిక్కుకున్న నేతలు వివరణ ఇచ్చేందుకు ఇవాళే చివరి రోజు. ఇప్పటికే తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నేడు హైదరాబాద్ కి రానున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు వివాదం క్లైమాక్స్ చేరే అవకాశం ఉంది. కొండా సుస్మిత వ్యాఖ్యలపై సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం నాడు 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. మంత్రి కొండా సురేఖను(Minister Konda Surekha) మంత్రి పదవినుంచి తప్పించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

వాట్సాప్ లోనే వివరణ ఇస్తా: చిన్నారెడ్డి

వాట్సాప్ లో నోటీసు పంపారు.. వాట్సాప్ లోనే వివరణ ఇస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి స్పష్టం చేశారు. చిన్నారెడ్డి వివరణ, తర్వాత చర్యలకి సంబంధించి కాంగ్రెస్ లో అటెన్షన్ వాతావరణం నెలకొంది.