22 August, 2026 | 1:15 PM

ఫార్మా కంపెనీ ముందు స్థానికుల ధర్నా

22-08-2026 12:20 PM

రూ.5కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ 

కంపెనీ మూసివేయాలని స్థానికుల ఆందోళన

యాదాద్రి భువనగిరి జిల్లా: భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం సమీపంలోని హెజిలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడంతో కంపెనీ ముందు అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల ప్రజలు ధర్నాకు దిగారు. తరచూ ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు, యాజమాన్యం తగిన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు.

ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5కోట్ల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వరుస ప్రమాదాలకు కారణమవుతున్న పరిశ్రమను వెంటనే మూసివేయాలని స్థానికులు కోరారు. కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లాలోని దోతిగూడెం పరిసరాల్లో గతంలోనూ ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2026 ఫిబ్రవరిలో దోతిగూడెం శివారులోని ఓ కెమికల్ కంపెనీలో పేలుడు సంభవించి ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన నమోదైంది.