సెన్సస్ హ్యాండ్‌బుక్‌లో ఖచ్చితమైన సమాచారమే నమోదు చేయాలి
తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి
ఆసిఫాబాద్(విజయక్రాంతి): జనగణన–2027లో భాగంగా రూపొందిస్తున్న డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్‌బుక్‌లో క్షేత్రస్థాయిలో ఉన్న ఖచ్చితమైన సమాచారాన్ని గ్రామాలు, మునిసిపాలిటీల వారీగా పారదర్శకంగా నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి ఆదేశించారు.శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రణాళిక శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, సమాచార సేకరణకు అవసరమైన సిబ్బందిని నియమించి వారికి శిక్షణ పూర్తి చేయాలని సూచించారు.
ఈ నెల 10 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు పూర్తి వివరాలను సేకరించి హ్యాండ్‌బుక్ తయారీని పూర్తి చేయాలని ఆదేశించారు.సమీకృత కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. హరిత పాల్గొన్నారు. జిల్లాలో డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్‌బుక్ తయారీకి అవసరమైన సమాచార సేకరణ కొనసాగుతోందని తెలిపారు.
పరిశ్రమలు, వైద్య ఆరోగ్యం, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, మార్కెట్ వసతులు, విద్యుత్, కమ్యూనికేషన్స్, రవాణా, రహదారులు, బ్యాంకింగ్, వ్యవసాయం, తాగునీటి సౌకర్యాలు తదితర అంశాలపై సమగ్ర వివరాలు క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నట్లు వెల్లడించారు.అవసరమైన సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామని, ప్రత్యేక కార్యక్రమం ద్వారా డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్‌బుక్‌ను రూపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రణాళిక శాఖ అధికారి గురువయ్య, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నాగేంద్రం, గ్రామీణ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిద్దికి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.






