16 July, 2026 | 4:13 PM

ఇన్ఫోసిస్ నికరలాభం 30% జంప్

19-04-2024 12:15 AM

l రూ.37,923 కోట్లకు ఆదాయం

l షేర్‌హోల్డర్లకు డివిడెండ్ నజరానా

l వచ్చే ఏడాది రెవిన్యూ గైడెన్స్ 1-- శాతం 

బెంగళూరు, ఏప్రిల్ 18: ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 30 శాతం వృద్ధిచెంది రూ.7,969 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 6,128 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన క్యూ4లో ఇన్ఫోసిస్ ఆదాయం 1 శాతం వృద్ధితో రూ. 37,441 కోట్ల నుంచి రూ.37,923 కోట్లకు పెరిగింది.అయితే 2023 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 2.2 శాతం క్షీణించింది.  పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికరలాభం 8.9 శాతం వృద్ధితో రూ.26,233 కోట్లకు, ఆదాయం 4.7 శాతం పెరిగి రూ.1,53,670 కోట్లకు చేరింది. క్యూ4లో 20.1 శాతం, ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 20.7 శాతం ఆపరేటింగ్ మార్జిన్లను కనపర్చింది.

గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేర్‌హోల్డర్లకు డివిడెండ్ నజరానాను సిఫార్సుచేసింది. షేరుకు రూ.20 తుది డివిడెండుకు అదనంగా రూ.8 స్పెషల్ డివిడెండును కంపెనీ బోర్డు సిఫార్సుచేసింది. షేర్‌హోల్డర్లకు భవిష్యత్తులో తగిన రాబడుల్ని ఇచ్చేలా క్యాపిటల్ అలకేషన్ పాలసీని బోర్డు ఆమోదించింది. ఈ పాలసీ ప్రకారం వచ్చే ఐదేండ్లలో 85 శాతం రాబడుల్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం వార్షిక డివిడెండు చెల్లింపుల్ని కంపెనీ పెంచుతూపోతుంది.

4.5 బిలియన్ డాలర్ల డీల్స్

ఈ జనవరి క్వార్టర్లో 4.5 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ సాధించినట్టు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇందులో 44 శాతం కొత్త డీల్సేనని, 2023 పూర్తి ఆర్థిక సంవత్సరంలో 17.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ వచ్చాయని, ఇది భవిష్యత్ వృద్ధికి పునాదిలాంటిదని కంపెనీ వివరించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో 848 మిలియన్ డాలర్ల క్యాష్‌ఫ్లో వచ్చిందని, గత 11 త్రైమాసికల్లో ఇదే అధిగమని, దీంతో వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ మెరుగుపడుతుందని ఇన్ఫోసిస్ తెలిపింది.

రెవిన్యూ గైడెన్స్ 1 శాతం

2024 ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయ వృద్ధి 1 శాతం మధ్య ఉంటుందంటూ ఇన్ఫీ గైడెన్స్‌ను ప్రకటించింది. ఆపరేటింగ్ మార్జిన్లు 20 శాతం మేర ఉంటాయని అంచనా వేసింది.  మధ్యకాలికంగా ఆపరేటింగ్ మార్జిన్లను పెంచుకోవడం, క్యాష్ జనరేషన్‌ను మెరుగుపర్చుకోవడం తన ప్రాధాన్యతలుగా ఇన్ఫోసిస్ ప్రకటించింది. 

జర్మనీ కంపెనీ కొనుగోలు

జర్మనీ కంపెనీ ఇన్‌టెక్‌లో నూరుశాతం వాటాను 450 మిలియన్ యూరోలకు (రూ. 4,000 కోట్లు) కొనుగోలు చేస్తున్నట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఈమొబిలిటీ, ఆటారమస్ డ్రైవింగ్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ తదితరాలకు ఇన్‌టెక్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఇండియాతో పాటు పలు దేశాల్లో 2,200 మంది ఉద్యోగులు కంపెనీకి ఉన్నారు. 

తగ్గిన వలసలు, ఉద్యోగులు

మార్చి త్రైమాసికంలో ఉద్యోగుల వలసల రేటు 12.6 శాతానికి తగ్గినట్టు ఇన్ఫీ వెల్లడించింది. డిసెంబర్ క్వార్టర్లో ఇది 12.9 శాతం ఉండగా, ఏడాది క్రితం ఈ రేటు 20.9 శాతంగా నమోదయ్యింది. కంపెనీ ఉద్యోగుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 7.5 శాతం  తగ్గింది. 2023 మార్చి చివరినాటికి 3,43,234 మంది ఉద్యోగులు ఉండగా, 2024 మార్చి 31నాటికి ఇన్ఫోసిస్ రోల్స్‌లో 3,17,240 మంది ఉద్యోగులు ఉన్నారు. 

‘ఈ ఏడాది మేము సాధించిన వృద్ధికంటే వచ్చే సంవత్సరానికి గైడెన్స్ ఎక్కువే. వ్యయాల్ని నియంత్రణ, కన్సాలిడేషన్ ద్వారా ఆ వృద్ధి గైడెన్స్‌ను సాధిస్తాం. ఫైనాన్షియల్ సర్వీసుల రంగం గత ఏడాదికంటే వచ్చే ఏడాది మెరుగ్గా ఉంటుంది. జనరేటివ్ ఏఐలో మా సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం’

 సలీల్ పరేఖ్

ఎండీ, సీఈవో, ఇన్ఫోసిస్