20 August, 2026 | 12:38 AM

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కోదాడ నియోజకవర్గానికి అన్యాయం

20-08-2026 12:32 AM

కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

మోతె, ఆగస్టు 19: ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలో కోదాడ నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని, నియోజకవర్గంలో పేదలు, రైతుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పట్టించుకోవడం లేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు.

బుధవారం మండల పరిధిలోని మామిళ్లగూడెం సుమంగళి ఫంక్షన్హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం 500 నుంచి 600 మా త్రమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం దారుణమన్నారు. రాజకీయ జోక్యానికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు. అలాగే మోతె మండలానికి రూ.5 వేల కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారని, అయితే పనులను వేగవంతం చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.

ప్రాజెక్టు పూర్తయితే మోతెతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో పెండింగ్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పేదలకు ఇళ్లు, రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైతే రానున్న కాలంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. అనంతరం ఇటీవల హత్యకు గురైన హలవత్ నాగు, బూబల కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆరే లింగారెడ్డి, మాజీ సర్పంచ్ వీరస్వామి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.