రైతుల వద్దకే బ్యాంకులు వెళ్లాలి
- రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు.. వ్యవసాయరంగం పునాది
- క్యూర్, ప్యూర్, రేర్ అనుగుణంగా బ్యాంకింగ్ వ్యూహాలు
- ఎస్‌ఎల్బీసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి) : తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు , 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో బ్యాంకింగ్, ఆర్థిక రంగం కీలక భాగస్వాములుగా మారాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా భవిష్యత్ బ్యాంకింగ్ వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
ప్రభుత్వ వ్యయంతో ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదని, భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులు, బలమైన ఆర్థిక సంస్థలు, లోతైన ఆర్థిక మార్కెట్లు, వినూత్న నిధుల విధానాలు అవసరమన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ లో బుధవారం జరిగిన 50వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ 2047 బ్యాంకింగ్ రోడ్‌మ్యాప్’ను రూపొందించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదించారు.
వ్యవసాయ, ఉత్పాదకత ఆధారిత రుణాలు, -స్టార్టప్ ఫైనాన్స్, మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ పరిశ్రమలు, యువత ఉపాధి ఆధారిత రుణాలు, గ్రీన్-క్లైమేట్ ఫైనాన్స్, డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జిల్లాల మధ్య క్రెడిట్ వ్యత్యాసాల నివారణ, దీర్ఘకాలిక మౌలిక వసతుల ఫైనాన్స్, కొత్త పరిశ్రమలు-సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలకు ఇందులో స్పష్టమైన వార్షిక లక్ష్యాలు ఉండాలని అన్నారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గ్రామీణ, వ్యవసాయ రంగం పునాది అని, రైతులకు రుణాలు అవసరమయ్యే సమయంలోనే అందించాలన్నారు. అర్హత ఉన్న రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. రైతుకు రుణం ఇవ్వడం మాత్రమే కాకుండా, ఆ రుణాన్ని అధిక, స్థిరమైన వ్యవసాయ ఆదాయంగా మార్చడమే లక్ష్యంగా ఉండా లని సూచించారు.
జూన్2026 నాటికి బ్యాంకులు వ్యవసాయ రంగానికి 52,337 కోట్లు రుణాలుగా అందించడం అభినందనీయమే అయినప్పటికీ, రుణాలు సకాలంలో అందడం ముఖ్యమని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రైజింగ్ 2047 కేవలం విజన్ డాక్యుమెంట్ కాదు.. తెలంగాణ ప్రజలతో మనకున్న అభివృద్ధి ఒప్పందం.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే బ్యాంకిం గ్ రంగం కూడా రూపాంతరం చెందాలి అని భట్టి స్పష్టం చేశారు. అలాగే తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో సూక్ష్మ, చిన్న , మధ్య తరహా రంగం కీలకమని అన్నారు. క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంట్ర్పైజెస్ కింద ఈ త్రైమాసికంలో రూ.4,463 కోట్ల విలువైన 16,265 ప్రతిపాదనలు ఆమోదం పొందడం అభినందనీయమన్నారు.
ప్రత్యేక రుణ వ్యూహాలను రూపొందించాలి
తెలంగాణ రైజింగ్ 2047లోని క్యూర్, ప్యూర్, రేర్ విధానాలకు అనుగుణంగా ప్రాంతాల అవసరాలను బట్టి ప్రత్యేక రుణ వ్యూహాలను రూపొందించాలని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో జనధ న్ ఖాతాలు భారీగా ఉన్నప్పటికీ దాదాపు 19.13 లక్షల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు.
అదేవిధంగా మహిళా స్వయం సహాయక సంఘాలను కేవలం బ్యాంక్ లింకేజీలకే పరిమితం చేయకుండా మైక్రోఎంటర్‌ప్రైజెస్‌గా తీర్చిదిద్దేలా ఎంటర్ ప్రైజ్ ఫైనాన్స్ అందించాలని కోరారు. సమావేశంలో పంచాయతీ రాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈఓ దివ్య పాల్గొన్నారు.






