20 August, 2026 | 1:18 AM

ఘనంగా నటరాజ రామకృష్ణ నృత్యోత్సవం

20-08-2026 12:17 AM

ముషీరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఎస్‌ఎంఎస్ గ్రూప్ చైర్మన్ జూపల్లి మంజుల రావు సహకారంతో లోక ఆరట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నటరాజ రామకృష్ణ జాతీయ నృత్యోత్సవాన్ని బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. డా. కళాకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. ఏనుగు నర్సింహారెడ్డి, రాజు భాను, శంకర్ పండీ, బద్వేలు సుబ్బారెడ్డి, జక్కుల త్రిశూల్ రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి గురు సుజాత మహోపాత్రకు నటరాజ రామకృష్ణ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు2026 ప్రదానం చేశారు. అలాగే వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన నృత్య కళాకారులకు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ జాతీయ అవారడ్స్2026 అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య కళలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

అనంతరం డా. కళాకృష్ణ ఆంధ్రనాట్యం, కేరళకు చెందిన చిత్ర సుకుమారన్ మోహినీ నృత్యం, సిరాజుద్దీన్ పేరిణి నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఫెస్టివల్ చైర్మన్ బీఆర్ విక్రమ్ కుమార్, లోక ఆర్ట్స్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సీడీఎఫ్‌ఓ నేషనల్ సెక్రటరీ సాయి వెంకటేష్, ఒడిశా సభ్యుడు జగపతి జన, డా. సజిని వల్లభనేని తదితర నాట్యగురువులు పాల్గొన్నారు.