అటవీ శాఖలో అవినీతి జలగలు..!
పులుల సంరక్షణ గాలికి.. నిందితులకు అండగా వసూళ్ల పర్వం
గత నెలలోనే రెండు ఘటనల్లో అవినీతి ఆరోపణలు
ఒకచోట సస్పెన్షన్లు, మరోచోట ఏసీబీ వల
అచ్చంపేట, ఆగస్టు 19: దేశంలోనే రెండో అతి పెద్దదైన అమ్రాబాద్ పులుల అభయారణ్యం.. అరుదైన వన్యప్రాణులకు నెలవు. జాతీయ జంతువైన పెద్దపులికి ఆవాసమైన ప్రాంతం. పెద్ద పులుల సంరక్షణ, అడవుల పరిరక్షణలో కీలకమైన ఈ ప్రాంతంలో కొందరు అటవీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వన్యప్రాణులకు హాని కలిగించే ఘటనలను అడ్డుకోవాల్సిన కొందరు సిబ్బంది.. అక్రమాలకు తావివ్వటం అటవీ శాఖకు తీరని మచ్చ తెచ్చిపెడుతోంది.
నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన వారే అవినీతిపరులకు వంత పాడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. అభయారణ్యంలో చోటుచేసుకునే ఘటనలను తొలిదశలోనే గుర్తించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన క్షేత్రస్థాయి సిబ్బంది.. కొన్నిచోట్ల నిందితులతో కుమ్మక్కవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఘటనలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కొన్ని ఘటనలు ఆలస్యంగానైనా బయటపడుతుండగా మరికొన్ని రాజకీయ ధన బలంతో మరికొన్ని ఘటనలు వెలుగులోకి రాకుండా భారీగా ముడుపులు చేతులు మారుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వెలుగుచూసిన రెండు ఘటనలు అటవీశాఖలోని కొందరు సిబ్బంది తీరుపై అనుమానాలకు తావిస్తున్నాయి.
కడితి మాంసం పంచుకున్న ఘటనలో..
అచ్చంపేట మండలం సిద్ధాపూర్ సెక్షన్ పరిధిలోని పద్మారంతండాలో జూలై 24న కుక్కల దాడిలో మృతి చెందిన వన్యప్రాణి కడితిని కొందరు గ్రామస్థులు కుప్పలుగా పోగేసుకొని పంచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం బయటకు రాకుండా ఘనపూర్ సెక్షన్కు చెందిన శిక్షణ అధికారి నరేందర్, సిబ్బంది నిరంజన్ ప్రసాద్ నిందితులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని, అందులో రూ.2 లక్షలు ముందుగానే తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి 17 మంది నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. విధుల్లో ఉన్న అధికారులు చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణల నేపథ్యంలో సెక్షన్ అధికారి నరేందర్, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్న సెక్షన్ అధికారి వెంకటేష్లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అవినీతిపరులను పట్టించిన అక్రమార్కులు
లింగాల మండలంలోని రేంజ్ కార్యాలయ పరిధిలో మరో ఘటన చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్షన్ అధికారి రాంబాబు, బీట్ అధికారి మురళీకృష్ణపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. జూలై 23న గ్రామానికి చెందిన కొందరు అనుమతి లేకుండా అడవిలోకి వెళ్లి కలప, పనిముట్లు తీసుకొని వస్తుండగా వారిని భయభ్రాంతులకు గురిచేసి రూ.50 వేలు వసూలు చేసి మరి కొంత డబ్బు డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
దీంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆశ్రయించారు. ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ అధికారులు మంగళవారం చర్యలు చేపట్టారు. మహబూబ్నగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో సెక్షన్ అధికారి రాంబాబు, బీట్ అధికారి మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో వేలాది హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన అటవీ ప్రాంతానికి క్షేత్రస్థాయి సిబ్బందే మొదటి రక్షణ కవచం. వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా, అడవిలో అక్రమ కార్యకలాపాలను గుర్తించి అడ్డుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. అలాంటి సిబ్బందిలో కొందరిపై వరుసగా అవినీతి ఆరోపణలు రావడం అటవీశాఖకు ఇబ్బందికరంగా మారింది. ఒక ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు సంబంధిత సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడగా.. మరో ఘటనలో ఏసీబీ రంగంలోకి దిగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
అయితే వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్నేనా క్షేత్రస్థాయిలో అధికారుల దృష్టికి రాకుండా మరెన్ని ఘటనలు జరుగుతున్నాయి. నిందితులతో కుమ్మక్కవుతున్న సిబ్బందిపై శాఖాపరంగా ఎలాంటి నిఘా ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు కీలకమైన అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ఇలాంటి ఆరోపణలకు తావులేకుండా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని, అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.






