28 May, 2026 | 2:23 AM

తిరుమలాయపాలెంలో గ్రామ దీపికల వినూత్న నిరసన

28-05-2026 01:51 AM

తిరుమలాయపాలెం మే 26 (విజయక్రాంతి): తిరుమలాయపాలెంలో వీడీపీలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తక్కువ వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతూ గ్రామ దీపికలు రోడ్డెక్కి మౌన దీక్షలు చేపట్టారు. నల్ల రిబ్బన్లు కట్టుకొని తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న తమకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.

అదేవిధంగా పదవీ విరమణ తర్వాత భద్రత కోసం పెన్షన్ సౌకర్యం కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబాలను పోషించేందుకు అప్పులు చేసి జీవనం సాగిస్తున్నామని పలువురు గ్రామ దీపికలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.