02-11-2025 08:40:05 PM
చిట్యాల (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న 8 వేల కోట్ల పైచిలుకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదివారం వెలిమినేడు గ్రామంలో దున్నపోతుకు వినతి పత్రం అందజేసి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి అరూరి ప్రణీత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చి విద్యార్థులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి తమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎన్నో మార్లు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించాలని వేడుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరూరి శివ, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.