దివ్యాంగులు, వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలి
అలింకో ఉపకరణాలు, సహాయక పరికరాలతో మేలు
ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన
రాజన్నసిరిసిల్ల,(విజయక్రాంతి): ఇల్లంతకుంట అలింకో, ఏడీఐపీ, ఆర్వీవై ఆద్వర్యంలో దివ్యాంగులు, వృద్ధులకు సహాయ ఉపకరణాల పంపిణీకి నిర్వహిస్తున్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. అలింకో, ఏడీఐపీ, ఆర్వీవై ఆద్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న శిబిరాన్ని ఇంచార్జి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వృద్ధులకు ఎంపిక కోసం చేస్తున్న ప్రక్రియను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు, వయో వృద్దులు ఉపకరణాలు, సహాయక పరికరాల గుర్తింపు కోసము క్యాంపులు నిర్వహిస్తున్నారని వివరించారు. అర్హులందరూ పాల్గొనాలని సూచించారు. దివ్యాంగులు యూడీఐడీ కార్డ్ కోసం మొబైల్ లేదా మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు కేటాయించిన తేదీల్లో దవాఖానకు వెళ్లాలని, అక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులపై వివక్ష చూపవద్దని, అందరితో సమానంగా గౌరవించాలని పేర్కొన్నారు.
అర్హులకు పరికరాలు అందిస్తున్న అలింకో బాధ్యులను అభినందించారు. శిబిరాల్లో అర్హత సాధించిన వారికి చేతి కర్రలు, చంక కర్రలు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్ళు, రోలెటర్స్, ఎం ఎస్ ఐ ఈ డీ కిట్ ఎం ఆర్ కిట్, స్మార్ట్ కేన్, అంధుల చేతి కర్ర, ఎల్ బో క్రచ్చేస్, అంధ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు సహాయక పరికరములు అందిస్తారని వెల్లడించారు. ట్రై పాడ్, టెట్రా ప్యాడ్,చేతి కర్రలు, వీల్ చైర్, వాకర్స్, వాష్ రూమ్ వీల్ చైర్, నడుం పట్టి, మెడ పట్టి, వినికిడి యంత్రాలు, ఫూట్ కేర్ యూనిట్, వాకింగ్ స్టిక్ విత్ సీట్, చంక కర్రలు, ఫోమ్ కుషన్, మోకాళ్ళ పట్టీలు, సహాయక పరికరములు ఇస్తారని తెలిపారు.
దివ్యాంగులు, వృద్దులు కావాల్సిన పత్రాలు వెంట తీసుకుని రావాలని సూచించారు. ఈ నెల 6వ తేదీ గురువారం చందుర్తి రైతు వేదికలో, 7 వ తేదీన శుక్రవారం వేములవాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయముల సముదాయంలో, 10వ తేదీన సోమవారం ముస్తాబాద్ రైతు వేదికలో, 11 వ తేదీన మంగళవారం సిరిసిల్ల సి.నా.రె. కళామందిరంలో శిబిరాలు నిర్వహిస్తారని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. శిబిరంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎంపీడీఓ శశికళ, తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో నిర్వహిస్తున్న ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు, కొనుగోళ్లు పరిశీలించారు. రైతులకు అన్ని వసతులు కల్పించాలని, తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి తరలించాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని వినియోగించుకోవాలి
అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సాయాన్ని వినియోగించుకొని నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఇల్లంతకుంటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లును పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో లబ్ధిదారులు తమ కలల ఇంటిని పూర్తి చేసుకోవాలని సూచించారు. సందర్శనలో గృహ నిర్మాణ శాఖ పీడీ శంకర్, ఎంపీడీఓ శశికళ, తదితరులు ఉన్నారు.






