04-11-2025 07:23:43 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పవిత్ర కార్తీక మాసం వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పెద్దవాగు వద్ద మహిళలు గంగాహాకతి ఇచ్చి దీపాలను వదిలారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పంచపర్వాల సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి స్థానిక పెద్దవాగులో భక్తులు స్నానమాచరించారు. ఉపవాస దీక్షలు, దీపదానాలు, తులసీ వివాహాలతో పట్టణం పండుగ వాతావరణం సంతరించుకుంది.
పెద్దవాగులో సాయంత్రం గంగాహరతి ఇచ్చి దీపాలను వదిలారు. ఆలయాలను దీపాలతో అలంకరించారు. బ్రాహ్మణవాడ కేశవనాథస్వామి ఆలయం, శివకేశవ ఆలయాల్లో కాగడహారతులతో పట్టణంలో భజనలు చేసుకొంటూ నగర సంకీర్తన చేపట్టారు. కార్తీక మాసం కావడంతో పండరినాథ నవరాత్రులను పురస్కరించుకొని పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరిక చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.